శ్రీకాకుళం జిల్లాలోని సీనియర్ నేతల్లో ఒకరుగా ఉన్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఈసారి అగ్ని పరీక్షగా ఎన్నికలు ఉన్నాయి. ఆయన గతసారి పోటీ చేసి ఓడిపోయారు. దాంతో అయిదేళ్ల పాటు పార్టీ పరంగా కార్యక్రమాలు నిర్వహించి జనంలో ఉన్నారు. మళ్ళీ మరో మారు ఆయన తన అద్రుష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈసారి గెలుపు ధర్మానకు చాలా అవసరంగా మారింది.

 


శ్రీకాకుళం నుంచి 2009 ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు గెలిచి జెండా ఎగురవేశారు. నాడు వైఎస్సార్ మంత్రివర్గంలో ఆయన కీలక శాఖలు నిర్వహించారు. ఆ తరువాత 2014 ఎన్నికల్లో చివరి నిముషంలో వైసీపీలో చేరిన ఆయన పోటీ చేసి ఓడిపోయారు. ఇక్కడ మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ సతీమణి లక్ష్మీ దేవికి గత ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు. ఆమె చాలా సులువుగా గెలిచేశారు. మహిళా జనాభా ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో మాజీ మంత్రి గుండా కుటుంబానికి మంచి పేరు ఉంది. పైగా ఆమె అయిదేళ్ల కాలంలో కొన్ని అభివ్రుధ్ధి పనులు చేశానని జనంలో చెప్పుకుంటున్నారు. అయితే ప్రభుత్వ వ్యతిరేకత బాగా ఉంది. గత సారి వూపు లేదు. దాంతో ఈసారి ఆమె విజయం మీద నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.

 


ఇక ధర్మాన విషయానికి వస్తే రాజకీయంగా ఆయన ఢక్కా మెక్కీలు తిన్నారు. ఈసారి గెలుపు కోసం గట్టి వ్యూహాలు రచిస్తున్నారు. గత పొరపాట్లు చేయకుండా అన్ని వర్గాలను ఆకట్టుకుంటున్నారు. పైగా వైసీపీ గాలి బాగా కలసివస్తోంది. గతసారి ఓడించినందుకు జనంలో ఉన్న సానుభూతి కలసివస్తుందని ధర్మాన భావిస్తున్నారు. పైగా చివరి అవకాశంగా తనను గెలిపించాలను ధర్మాన ప్రజలను అడుగుతున్నారు. మరి ప్రజలు కూడా సానుకూలంగా స్పందిస్తే ధర్మాన విజయం నల్లేరు మీద నడకే అవుతుంది. అయితే మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ వ్యూహాలు కూడా ఘనమైనవే. దాంతో ఇక్కడ పోరు రసవత్తరంగా ఉంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: