ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారానికి ఇక 30 గంటలు మాత్రమే ఉంది.  నువ్వా నేనా అన్నట్టు ఏపిలో ప్రచారాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల మద్య ప్రచారాలు మూడు నెలల నుంచి కొనసాగుతున్నాయి.  అధికార పార్టీ తాము చేసిన అభివృద్ది పనులు  ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నామని..తమదే గెలుపు అని ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు.  గత నాలుగు ఏళ్లుగా ప్రజలకు ఇచ్చిన హామీలే ఏ ఒక్కటీ నెరవేర్చలేదని..కంటి తుడుపు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని..టీడీపీని ఎవ్వరూ నమ్మే పరిస్థితిలో లేరని ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు చెబుతున్నాయి. 

ఇక అధికార, ప్రతిపక్ష పార్టీలు దొందూ దొందే అంటూ ప్రచారం చేస్తున్నారు జనసేన నేతలు.  దాదాపు నెల రోజులకు పైగా సాగిన ఎన్నికల ప్రచార హోరు మరో 30 గంటల్లో ముగియనుంది.  రేపు సాయంత్రం 5 గంటలకు మైకులు బంద్ కానున్నాయి. ఈ రెండు రోజులూ తెలుగు రాష్ట్రాల్లోని అందరు ప్రధాన నాయకులు, పోటీలో నిలబడిన అభ్యర్థులూ ప్రజల్లోకి వెళ్లి తమను గెలిపించాలని ప్రచారం చేయనున్నారు. 

ప్రస్తుతం కొద్ది గంటల్లోనే అన్ని రకాలుగా ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు పార్టీ నేతలు.  నాయకులంతా రోడ్ షోలు, బైక్ ర్యాలీలు, సభలతో బిజీబిజీగా ఉన్నారు.కాగా, హైదరాబాద్ లో తొలుత భావించినట్టుగా సీఎం కేసీఆర్ బహిరంగ సభ లేనట్టేనని తెలుస్తోంది.  రేపు రాష్ట్రానికి అమిత్ షా వచ్చి రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబునాయుడితో పాటు విపక్ష నేత వైఎస్ జగన్ నేడు, రేపు పలు సభలు, రోడ్ షోలలో పాల్గొని తమ మలి దశ ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఇక రాహుల్ పర్యటన కూడా రద్దయినట్టు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: