ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఆచంటలో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తెస్తున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ…. విజయాన్ని దక్కించుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే మూడుసార్లు హ్యాట్రిక్ విజయాలను సాధించి మంత్రిగా కొనసాగుతున్న పితాని సత్యనారాయణ..మరోసారి టీడీపీ నుంచి బరిలోకి దిగి గెలుపుని సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. ఇక పితానికి చెక్ పెట్టి వైసీపీ జెండా ఎగురువేయాలని చెరుకువాడ శ్రీరంగనాథరాజు భావిస్తున్నారు. ఇక వీరికి పోటీగా జనసేన అభ్యర్ధి జవ్వాది వెంకట విజయరామ్‌ కూడా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.


సీనియర్ నేతగా పితానికి నియోజకవర్గంపై మంచి పట్టుంది. అలాగే 2014లో టీడీపీ తరుపున గెలిచిన పితాని...ఆచంటలో అభివృద్ధి  బాగానే చేశారు. అయితేనే పితాని ముందునుంచి కుల రాజ‌కీయాల‌నే న‌మ్ముకుంటార‌న్న విమ‌ర్శ‌లు తీవ్రంగా ఉన్నాయి. ఆయ‌న కేవ‌లం త‌న వ‌ర్గానికే ప్రాధాన్య‌త ఇస్తూ మిగిలిన వ‌ర్గాల‌ను దూరం పెట్ట‌డంతో పాటు వారు ఎద‌గ‌కుండా తెర‌వెనక ప్ర‌య‌త్నాలు చేస్తార‌న్న అప‌వాదు ఆయ‌న‌పై ఎప్ప‌టి నుంచో ఉంది. ఈ క్ర‌మంలోనే ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న చాలా వ‌ర్గాల‌కు దూర‌మ‌య్యారు. ఇక సొంత సామాజిక‌వ‌ర్గ‌మైన  శెట్టిబలిజల్లో కొంత వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతని కొంత తగ్గించడానికి శెట్టిబలిజ సామాజికవర్గంలో బలమైన నేతని  మల్లు లక్ష్మీనారాయణని పార్టీలోకి తీసుకొచ్చారు. ఇక టీడీపీ కేడర్‌ని కూడా పితాని పట్టించుకోలేదని విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు గత ఎన్నికల్లో సపోర్ట్ చేసిన జనసేన ఇప్పుడు పోటీలో ఉండటం మైనస్ అయ్యేలా ఉంది.


ఆచంట నియోజ‌క‌వ‌ర్గంలో కాపు సామాజిక‌వ‌ర్గం ఓట్లు కూడా భారీగా ఉండ‌డంతో పితానికి ఎదురు దెబ్బ త‌ప్పేలా లేదు. గ‌త ఎన్నిక‌ల్లోనే చావుత‌ప్పి క‌న్నులొట్ట‌బోయిన చందంగా గెలిచిన పితాని ఈ సారి స‌మ‌స్య‌ల వ‌ల‌యంలో విల‌విల్లాడుతున్నారు. అటు వైసీపీ అభ్యర్ధి శ్రీరంగనాథ రాజు....ప్రజలని ఆకర్షిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే పార్టీ మేనిఫెస్టో నవరత్నాలని ప్రజల్లోకి తీసుకెళ్లారు. పైగా ఆర్ధికంగా కూడా రంగనాథరాజు బలంగా ఉన్నారు. గ‌తంలో అత్తిలి ఎమ్మెల్యేగా గెలిచిన‌ప్పుడు ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న కొన్ని ప్రాంతాలు ఇప్పుడు ఆచంట‌లో ఉండ‌డం ఆయ‌న‌కు ప్ల‌స్‌. ఇక్కడ వైసీపీ కేడర్ బలంగా ఉంది. అయితే జనసేన పోటీలో ఉండటం వలన ఎవరి ఓట్లు చీలుస్తుందనే భయం ఇరు పార్టీలలో ఉంది. దీనికి తోడు జనసేన కూడా బలంగా ఉంది. ఆ పార్టీ అభ్యర్ధి జవ్వాది విజయరామ్‌కి కాపు ఓట్లు ఎక్కువగా పడే అవకాశం ఉంది.


సామాజికవర్గాల పరంగా చూస్తే శెట్టిబలిజ  ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. వీరే పార్టీల గెలుపుని డిసైడ్ చేసే స్థాయిలో ఉన్నారు. ఇక వీరి తర్వాత ఎస్సీలు 35 వేలు వరకు ఉన్నారు. అలాగే  కాపులు కూడా ఎక్కువగానే ఉన్నారు. మొత్తం మీద మూడు పార్టీల మధ్య త్రిముఖ పోరు జరుగుతున్న...గెలుపు మాత్రం టీడీపీ-వైసీపీ అభ్యర్డుల్లో ఒకరికి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. కాకపోతే జనసేన చీల్చే ఓట్ల ప్రభావం ఎవరికి నష్టం కలిగిస్తుందో ఎన్నికల్లో తెలుస్తోంది. ప్రస్తుతం అయితే పితాని-రంగనాథరాజులు మధ్య టఫ్ ఫైట్ జరగనుంది. గ‌త మూడు ఎన్నిక‌ల్లో ఎప్పుడూ లేనంత వ్య‌తిరేక‌త‌తో ఈ సారి పితాని ఎన్నిక‌ల్లో ఉన్నారు. రంగ‌నాథ‌రాజు వ్యూహాల‌తో దూసుకుపోతుంటే పితాని స‌మ‌స్య‌ల‌తో కొట్టుమిట్టాడుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: