కృష్ణా జిల్లా కేంద్రంగా ఉన్న మచిలీపట్నం(బందరు)లో టీడీపీ, వైసీపీ, జనసేనల మధ్య అదిరిపోయే ఫైట్ జరగనుంది. ఇప్పటికే ప్రచారాలతో నియోజక వర్గాన్ని చుట్టేసిన మూడు పార్టీలు ఎన్నికలు సమరానికి సిద్ధమయ్యాయి. టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర మరోసారి విజయం సాధించాలని చూస్తుండగా రవీంద్రని నిలువరించి గెలుపు తన సొంతం చేసుకోవాలని వైసీపీ అభ్యర్ధి పేర్ని వెంకట్రామయ్య(నాని) చూస్తున్నారు. ఇక వీరిద్దరికి చెక్ పెట్టి జనసేన జెండా ఎగురువేస్తానని బండి రామకృష్ణ ధీమాగా ఉన్నారు. మూడు పార్టీల బ‌లాబ‌లాలు, మైన‌స్‌ల విష‌యానికి వ‌స్తే ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రధానంగా టీడీపీకి ప్లస్ అవుతున్నాయి. 


ప్ర‌భుత్వం అధికారంలో ఉన్నా బంద‌రు పోర్టు అతీ గ‌తీ లేక‌పోవ‌డం ఆయ‌న‌కు మైన‌స్‌. బంద‌రు పోర్టుపై మంత్రి ఎప్పుడూ కాక‌మ్మ క‌బుర్లే చెపుతూ కాలం గ‌డిపేశారు.  టీడీపీ కేడర్‌ కూడా ఇక్కడ బలంగా ఉంది. అయితే మంత్రి మీద అవినీతి ఆరోపణలు రావడం, గత ఎన్నికల్లో సపోర్ట్ ఇచ్చిన జనసేన పోటీ చేయడం కొల్లుకి ఇబ్బందికరంగా మారే పరిస్తితి ఉంది. ఎక్సైజ్ మంత్రిగా  ఉన్న‌ప్పుడు మంత్రి కొల్లు ర‌వీంద్ర పేరు చెప్పుకుని ఆయ‌న మామ అయిన మాజీ మంత్రి న‌ర‌సింహారావు చాలా దందాలు చేశార‌న్న విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి. ఇక వైసీపీ విష‌యానికి వ‌స్తే అటు రెండు సార్లు బందరు ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం వైసీపీ అభ్యర్ధి పేర్ని నానికి ఉంది. మంత్రిగా ప‌నిచేయ‌డం కూడా నానికి ప్ల‌స్‌. కొన్ని ప్రాంతాల్లో నానికి మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా ఎమ్మెల్యే వ్యతిరేకత కొంతవరకు కలిసిరావొచ్చు.


అయితే జనసేన పోటీలో ఉండటం నానికి నష్టమే. ఒకవేళ జనసేన పోటీలో లేకపోతే నానిదే గెలుపు అని ప్రచారం కూడా ఉంది. జనసేన నుంచి పోటీ చేస్తున్న రామకృష్ణకి అర్ధబలం, అంగబలం దండిగా ఉన్నాయి. నియోజకవర్గంలో అందరినీ కలుపుకుపోయే గుణం ఉందని టాక్ ఉంది. పైగా ఇక్కడ పవన్ అభిమానులు, కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువ ఉండటం రామకృష్ణకి మెయిన్ ప్లస్ పాయింట్. కానీ టీడీపీ, వైసీపీలకి ఉన్న కేడర్ జనసేనకి లేదు. ఇక ఇక్కడ అభ్యర్ధులు కంటే కులాల పరంగానే ఎన్నికలు జరుగుతాయి. కాపు సామాజికవర్గానికి చెందిన ఓటర్లే ఇక్కడ అభ్యర్ధుల గెలుపుని డిసైడ్ చేస్తారు.

వైసీపీ, జనసేన అభ్యర్థులు కాపు సామాజికవర్గానికి చెందినవారు కాగా, టీడీపీ అభ్యర్థి మత్స్యకారుల సామాజికవర్గానికి చెందినవారు. అయితే కాపు ఓటింగ్ మూడు పార్టీలకి పడే అవకాశం ఉంది. అలాగే కాపులు తర్వాత బీసీలు, ఎస్సీలు ఎక్కువ ప్రభావం చూపనున్నారు. ప్రస్తుత పరిస్థితులని బట్టి చూస్తే...మూడు పార్టీలు మధ్య హోరాహోరీ పోరు జరగడం ఖాయంగా ఉన్నా మంత్రి కొల్లుపై ఉన్న వ్య‌తిరేక‌త నానికే లాభిస్తుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. అయితే కాపుల ఓట్లు వైసీపీ, జ‌న‌సేన మ‌ధ్య చీలితేనే టీడీపీకి ప్ల‌స్ కావొచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: