తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎన్నికల జోరు కొనసాగుతుంది.  ఏపిలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.  ఇక తెలంగాణలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి..కాంగ్రెస్ మహాకూటమిగా ఏర్పడి టీఆర్ఎస్ ని ఓడించాలని విశ్వ ప్రయాత్నాలు చేసినప్పటికీ..ప్రజలు మాత్రం టీఆర్ఎస్ కే పట్టం కట్టారు.  అయితే లోక్ సభ లో 16 సీట్లకు పదహారు గెల్చుకుంటామని అధికార పార్టీ టీఆర్ఎస్ అంటుంది.  మరోవైపు కాంగ్రెస్, బీజేపీలు కూడా గట్టి పట్టుమీదే ఉన్నాయి.   అయితే  కొన్ని  స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడక లాగే కనిపిస్తున్నా... కొద్ది చోట్ల మాత్రం ఆ పార్టీకి కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. తెలంగాణ లో టీఆర్ఎస్, కాంగ్రెస్ కి కీలక స్థానంగా మారింది చేవెళ్ల.  ప్రస్తుతం చేవేళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ  చేస్తున్నారు. 


గత లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి... కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కార్తీక్ రెడ్డిపై విజయం సాధించారు.  ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సంధర్భంగా  కొండా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.  ఆర్థికంగా బలంగా ఉన్న విశ్వేశ్వర్ రెడ్డిని ఎదుర్కోవడానికి మరో పారిశ్రామిక వేత్త అయిన రంజిత్ రెడ్డిని పార్టీలో చేర్చుకుని బరిలో నిలిపింది టీఆర్ఎస్. ఇటీవల కాంగ్రెస్ తరుపు నుంచి పోటీ చేసిన సబితా ఇంద్రారెడ్డి ఆమె తనయుడు కార్తీక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే.  ఇక కొండా గెలుపు కోసం ఏకంగా రాహూల్ గాంధీ, సోనియా గాంధీ రంగంలోకి దిగే ప్రయత్నం చేస్తున్నారు.

మరోవైపు రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉండటం, ఆర్థికంగా బలంగా ఉండటం, నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేతలంతా ఆయన విజయం కోసం కష్టపడుతుండటం రంజిత్ రెడ్డికి పాజిటివ్ అంశాలుగా చెప్పొచ్చు.  దాంతో ఇప్పుడు కాంగ్రెస్, టీఆర్ఎస్ నువ్వా నేనా అన్న పరిస్థితుల్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే... బీజేపీ తరపున బండారు దత్తాత్రేయ వియ్యంకుడు జనార్ధన్ రెడ్డి చేవెళ్ల నుంచి బరిలో ఉన్నారు.

చేవెళ్ల సీటు మీదే అని బీజేపీ పెద్దలు హామీ ఇవ్వడంతో ఎప్పటి నుంచో చేవెళ్లలో గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ హోరా హరీ మద్య బీజేపీ ఎన్ని ఓట్లు సంపాదిస్తుందన్న అనుమానాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  తెలంగాణ లో బీజేపీ చీల్చే ఓట్లే ఈ రెండు పార్టీల గెలుపోటములను నిర్దేశిస్తుందనే ప్రచారం కూడా సాగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: