మంగళగిరిలో లోకేశ్ గెలుస్తాడా..? ఇదే ఇప్పుడు రాష్ట్రంలో అందరూ ఎక్కువ చర్చికుంటున్న విషయం....2014 లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వంలో లోకేశ్ ఎమ్మెల్సీ ద్వారా మంత్రి అవడంతో... ప్రతిపక్షాలన్నీ లోకేశ్ దొడ్డిదారిన మంత్రి అయ్యాడని ఫుల్ కౌంటర్లు వేశారు. దీంతో ఆ విమర్శలకి చెక్ పెట్టేందుకు గానూ లోకేశ్ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. లోకేశ్ పోటీ చేసేందుకు ముందుగా రాష్ట్రంలోని చాలా నియోజ‌క‌వ‌ర్గాల‌ను ప‌రిశీలించారు. హిందూపురం, విశాఖ నార్త్, భీమిలి, పెన‌మ‌లూరు, పెద‌కూర‌పాడు, కుప్పం నియోజ‌క‌వ‌ర్గాల పేర్ల‌ను వ‌డ‌పోసి చివ‌రకు రాజ‌ధాని ప‌రిధిలో ఉన్న మంగ‌ళ‌గిరిని ఎంపిక చేశారు. ఈ వ‌డ‌పోతల త‌ర్వాత టీడీపీకి ఎక్కువ సార్లు గెలిచిన ట్రాక్ రికార్డు లేని మంగళగిరి బరిలో ఉన్నారు. దీంతో ఇక్కడ లోకేశ్ గెలుస్తాడా....లేక ఆళ్ళ రామకృష్ణ రెడ్డి మళ్ళీ వైసీపీ జెండా ఎగురువేస్తాడాని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది.  వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎస్కే సలీం, జనసేనతో పొత్తుల్లో భాగంగా సీపీఐ నుంచి ముప్పాళ్ల నాగేశ్వరరావు, బీజేపీ నుంచి జగ్గారపు రామ్మోహనరావు పోటీలో ఉన్నారు. ఎంతమంది పోటీలో ఉన్న అసలు పోరు మాత్రం లోకేశ్, ఆళ్ళ మధ్యనే జరుగుతుంది. 


గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన ఆళ్ళ రామకృష్ణా రెడ్డి కేవలం 12 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్ధిపై విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ళ నియోజకవర్గంలో సామాన్యుడుగానే ఉంటాడు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడుతూ అనేక సార్లు కోర్టు మెట్లు ఎక్కారు. సామాన్యుడుగా ప్రజల మధ్యలో ఉండటం...వైసీపీ కేడర్ బలంగా ఉండటం ఆళ్ళకి కలిసొచ్చే అంశాలు. రాజ‌ధాని భూములు, ఇత‌ర‌త్రా అంశాల విష‌యంలో ఆర్కే పేద‌ల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. చివ‌ర‌కు స‌దావ‌ర్తి భూముల విష‌యంతో పాటు చాలా విష‌యాల్లో ఆర్కే ప్ర‌భుత్వంపై కోర్టుల్లో పోరాటాలు చేశారు. అయితే ఆళ్ళ ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేగా ఉండి పెద్దగా నియోజకవర్గాన్ని పట్టించుకోలేదనే విమర్శలు ఉండటం మైనస్ అయ్యే అవకాశం ఉంది. 


ఇక మంగళగిరి రాజధాని ప్రాంతంలో ఉండటంతో...టీడీపీ ప్రభుత్వం అభివృద్ది బాగా చేసింది. ఐటీ మంత్రిగా లోకేశ్ కూడా పలు సాఫ్ట్‌వేర్ సంస్థలని ఇక్కడకి తీసుకొచ్చారు. అలాగే తన దగ్గరకి నియోజకవర్గ ప్రజలు ఎప్పుడైనా రావోచ్చని, మధ్యలో పి‌ఏలు ఎవరు ఉండరని చెబుతూ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే అభివృద్ధి బాగా చేశానని, ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇంకా ఎక్కువ చేస్తానని చెబుతూ ప్రజలని ఆకర్షిస్తున్నారు. కానీ లోకేశ్ నాన్-లోకల్ అని, తన దగ్గరకి ప్రజలు వెళ్ళడం కష్టమని ఆళ్ళ ప్రచారం చేస్తున్నారు. వీటికి తోడు ప్రచారంలో లోకేశ్ తడబడుతూ మాట్లాడటం ఇబ్బంది అయ్యేలా కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో మాదిగ, చేనేత సామాజికవర్గానికి చెందిన ఓటర్లే కీలకం కానున్నారు. వీరి తర్వాత బీసీ, మాల, కాపు, కమ్మ, రెడ్డి, ముస్లింల ఓట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇక లోకేశ్, ఆళ్ళ సామాజికవర్గాలు ఏంటో అందరికీ తెలుసు.


రాజధాని ప్రాంతం కావడంతో ఇరు పార్టీలు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టేందుకు కూడా వెనుకాడటం లేదని తెలుస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితులని బట్టి చూస్తే...ఎవరి గెలుపు అంత సులువు కాదని అర్ధమవుతుంది. ఎవరు గెలిచిన తక్కువ మెజారిటీతోనే బయటపడుతారని తెలుస్తోంది.  లోకేశ్ గెలుపు కోసం కోట్లాది రూపాయ‌లు మంచినీళ్ల‌లా ఖ‌ర్చు చేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న సామాజిక‌వ‌ర్గాల వారీగా కీల‌క నేత‌ల‌ను ఇక్క‌డ మోహ‌రించి మ‌రీ ప్ర‌చారం చేయిస్తున్నారు. చివ‌ర‌కు లోకేశ్ భార్య నారా బ్రాహ్మ‌ణి కూడా ప్ర‌చార‌ప‌ర్వంలోకి దిగారు. ఇక తాడేపల్లి మునిసిపాలిటీ, తాడేప‌ల్లి మండ‌లంలో వైసీపీకే మెజార్టీ ఉంటుంద‌ని టీడీపీ వాళ్లు సైతం అంగీక‌రిస్తున్నారు. మంగ‌ళ‌గిరి రూర‌ల్ మండ‌లంలో టీడీపీకే ఎడ్జ్ ఉంటుంది. దుగ్గిరాల మండ‌లంలో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకే మెజార్టీ వ‌చ్చింది. ఈ సారి ఇక్క‌డ వైసీపీకి స్వ‌ల్ప ఎడ్జ్ ఉండ‌డం లేదా హోరాహోరీ త‌ప్ప‌దు. ఇక ఇరు పార్టీల‌కు మంగ‌ళ‌గిరి ప‌ట్ట‌ణం కీల‌కం. మ‌రి ప‌ట్ట‌ణ ఓట‌ర్లు ఎవ‌రిని క‌రుణిస్తారో ?  మంగ‌ళ‌గిరి విన్న‌ర్ వారే కానున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: