గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ స్థానంలో ఓ వృద్ధుడికి ఓ కుర్రవాడికి మధ్య ఆసక్తికరమైన పోరుసాగుతోంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ రాయపాటి సాంబశివరావు పోటీ చేస్తున్నారు. వైసీపీ తరపున విజ్ఞాన్ విద్యాసంస్థల డైరెక్టర్ లావు శ్రీకృష్ణదేవరాయలు పోటీకి దిగడంతో.. నరసరావుపేటలో పోటీ రసవత్తరంగా మారింది. 


ఇదే స్థానంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తొలిసారి పార్లమెంటు బరిలోకి దిగారు. ఈ స్థానంలో రాయపాటి సాంబశివరావు ఎంపిక జరిగిన తీరు వైసీపీ విజయాన్ని చెప్పకనే చెబుతోంది. చంద్రబాబు తీవ్ర తర్జనభర్జనలు తర్వాత రాయపాటి సాంబశివరావుకు టికెట్ ఇచ్చారు. 

ఒకవిధంగా రాయపాటి చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేయడం వల్లే టికెట్ దక్కిందన్న వాదనలూ ఉన్నాయి. ఈ ఎంపీ సీటు పరిధిలోనే కోడెల శివప్రసాదరావు, ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, జీవీ ఆంజనేయులు వంటి హేమాహేమీ అసెంబ్లీ బరిలో ఉన్నారు. రాయపాటి ఎంపీగా ఉన్నా పెద్దగా పట్టించుకుందేమీ లేదన్న వాదన స్థానికుల నుంచి వినిపిస్తోంది. 

పార్టీ నుంచి  కూడా సహకారం అంతంత మాత్రంగానే ఉంది. కాంట్రాక్టు పనులపై ఉన్న శ్రద్ధ ప్రజాసేవపై లేదని చెబుతారు. మరోవైపు వయసు మూలంగా ప్రచారంలో అనుకున్నంత వేగం లేదు. ఇక ఇక్కడి నుంచి వైసీపీ విజ్ఞాన్ విద్యాసంస్థల డైరెక్టర్ లావు శ్రీకృష్ణదేవరాయలను పోటీలో నిలిపింది. తొలిసారి నరసరావుపేట ఎంపీ స్థానం తమదే అన్నధీమా వైసీపీలో కనిపిస్తోంది. 

యువకుడు, విద్యావంతుడు కావడం.. తండ్రికి విద్యావేత్తగా ఉన్న పేరు  శ్రీకృష్ణదేవరాయలుకు కలసివస్తున్నాయి.  పల్నాడు ప్రజల సమస్యలపై ఇప్పటికే ఆయన ఓ యాక్షన్ ప్లాన్ రూపొందించుకుని ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ తెలుగుదేశానికి చెందిన కమ్మ ఓట్లను లావు శ్రీకృష్ణదేవరాయలు బాగా చీల్చే అవకాశం మెండుగా ఉంది. ఎంపీ రాయపాటి వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లినందున తన విజయం ఖాయమని ఆయన చెబుతున్నారు. రాయపాటికి, కన్నా లక్ష్మీనారాయణకు ఉన్న చిరకాల వైరం శ్రీకృష్ణ దేవరయాలకు అయాచిత వరంగా మారింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: