తెలుగుతో పాటు తమిళ భాష, సంస్కృతి, సాంప్రదాయాలు ఎక్కువగా ఉన్న నగరి నియోజకవర్గంలో ఈసారి రసవత్తరమైన పోరు జరగనుంది. 2014 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నగరి నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గాలి ముద్దు కృష్ణమనాయుడ్ని 858 ఓట్లతేడాతో ఓడించిన సినీ నటి రోజా...ఈ ఎన్నికల్లో కూడా వైసీపీ నుంచే బరిలో దిగుతున్నారు. ఇక టీడీపీ నుంచి గాలి ముద్దు కృష్ణమనాయుడు మరణించడంతో...ఆయన తనయుడు గాలి భాను ప్రకాష్ పోటీ చేస్తున్నారు. జనసేన పొత్తులో భాగంగా బీఎస్పీ పోటీ చేస్తుంది. అలాగే ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ కూడా పోటీలో ఉన్న...టీడీపీ-వైసీపీల మధ్యే ప్రధాన పోరు జరగనుంది. అయితే తొలిసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిన రోజా..ముఖ్య‌మంత్రి చంద్రబాబు పైనా..లోకేష్ పైనా అనేక సార్లు తీవ్ర విమ‌ర్శ‌లు చేసారు. అసెంబ్లీలోనూ కాల్ మ‌నీ వ్యవహారంలోనూ సీఎంపై అనుచిత వ్యాఖ్మ‌లు చేసారు. ఫ‌లితంగా శాస‌న‌స‌భ నుండి ఏడాది పాటు సస్పెండ్ అయ్యారు. 


విమ‌ర్శ‌ల సంగ‌తి అలా ఉంచితే రోజా వైసీపీ శ్రేణుల్లో రాష్ట్ర వ్యాప్తంగా జోష్ నింపే విష‌యంలో మంచి మార్కులే వేయించుకున్నారు. ప్ర‌త్య‌ర్థుల‌పై ప‌దునైన మాట‌ల‌తో విరుచుకు ప‌డే విష‌యంలో మంచి మార్కులే వేయించుకున్నారు. ఇక ఎక్కువుగా చెన్నై, హైద‌రాబాద్‌కు ప‌రిమిత‌మ‌య్యే ఆమె  ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని పెద్దగా అభివృద్ధి చేసింది లేదని విమర్శలు ఉన్నాయి. అయితే నాలుగేళ్ళు నియోజకవర్గాన్ని పట్టించుకోపోయిన చివరి సంవత్సరం మాత్రం నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు చేశారు. సొంత నిధులతో తాగునీటి సమస్య నివారణకు బోర్లు వేయించారు. అలాగే వైఎస్సార్ పేరిట మొబైల్ క్యాంటీన్లు ఏర్పాటు చేసి తక్కువ ధరకి పేదలకి భోజనం అందించారు. చివ‌ర్లో ఆమె న‌గ‌రిలోనే సొంత ఇళ్లు క‌ట్టుకుని అక్క‌డే ఉండి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉన్నారు. వీటికి తోడుగా ఇక్కడ వైసీపీ కేడర్ బలంగా ఉండడం రోజాకి కలిసొచ్చే అంశం.


ఇక తండ్రి పేరుతోనే గాలి భాను ప్రకాష్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. టీడీపీకి బలమైన కేడర్ ఉండటం, గాలి మరణం తర్వాత ప్రజల్లో సానుభూతి ఉండటం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు భానుకి ప్లస్ కానున్నాయి. క్లీన్ఇమేజ్ ఉన్న ఫ్యామిలీ వార‌స‌త్వం నుంచి వ‌చ్చిన భాను గ‌త ఐదేళ్లుగా నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉన్నారు. కానీ టికెట్ కోసం కుటుంబంలోనే ఆధిపత్య పోరు నడవడంతో ... భానుకి మిగిలిన కుటుంబ సభ్యులు ఏ మేర సపోర్ట్ ఇస్తారో చెప్పలేని పరిస్తితి నెలకొంది. ఎన్నికల్లో కూడా ఇదే అసంతృప్తి కొనసాగితే భానుకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఇక నియోజ‌క‌వ‌ర్గంలో సీటు ఆశించిన మిగిలిన నాయ‌కుల‌కు బాబు హామీలు ఇచ్చినా వారు ఎంత వ‌ర‌కు స‌పోర్ట్ చేస్తార‌న్న సందేహాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో మొదలియార్ ఓటర్లు ఎక్కువ. ఆ తరువాత ఎస్సీలు ఎక్కువగా వున్నారు. తరువాతి స్థానాల్లో వన్నె రెడ్లు, కమ్మ ఓట్లు ఉన్నారు. అయితే మొదలియార్ల మొగ్గు ఎవరివైపు ఎక్కువగా వుంటే వారే విజేతలయ్యే అవకాశం ఉంది.


ప్రస్తుత పరిస్థితులని చూస్తుంటే...ఎవరి గెలుపు అంత సులువు కాదని తెలుస్తోంది. టీడీపీ-వైసీపీల మధ్య హోరాహోరీ పోరు జరగడం ఖాయం. అయితే ఎన్నికల్లో చోటు చేసుకునే పరిణామాలు బట్టి ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరి చూడాలి నగరిలో రోజా రెండో సారి గెలుస్తుందో లేక....భాను తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ టీడీపీకి విజయం దక్కేలా చేస్తారో.


మరింత సమాచారం తెలుసుకోండి: