రాజకీయాల్లో బంధుత్వాలు ఉండవన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే తరహాలో బావాబామ్మర్దులు అయిన ఇద్దరు నేతలు ఎన్నికల పోరులో హోరాహోరీగా తలపడుతున్నారు. ఇక ఆ ఇద్దరు నేతలు ఎవరో కాదో..ఆముదాలవలస నియోజకవర్గానికి చెందిన టీడీపీ అభ్యర్ధి కూన రవికుమార్...వైసీపీ అభ్యర్ధి తమ్మినేని సీతారాం....తమ్మినేని అక్క కుమారుడు రవికుమార్‌. అలాగే సీతారాం భార్య వాణి స్వయానా రవికుమార్‌కు అక్క. దీంతో వీరు మేనమామ-మేనల్లుడు, బావ-మరిది అయ్యారు. వీరు 2009లో, 2014 ఎన్నికల్లో కూడా ప్రత్యర్ధులుగా తలపడ్డారు. ఇక వీరికి పోటీ ఇచ్చేందుకు జనసేన కూడా రామ్మోహన్‌ని బరిలోకి దించింది. అయితే జనసేన ఉన్న అసలు పోటీ మాత్రం కూన-తమ్మినేని మధ్యే జరగనుంది. 2014లో తమ్మినేనిపై గెలిచి కూన రవికుమార్...టీడీపీ ప్రభుత్వంలో విప్‌గా పని చేశారు. పార్టీపై ప్రత్యర్ధులు విమర్శలు చేస్తే వాటిని సమర్ధవంతంగా తిప్పికొట్టే నేతల్లో కూన ముందుండేవారు. 


ఇక ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలని అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చేశారు. ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉండటం, టీడీపీ కేడర్ బలంగా ఉండటం కూనకి కలిసొచ్చే అంశాలు. అయితే నియోజ‌క‌వ‌ర్గంలో కీల‌క‌మైన షుగ‌ర్ ఫ్యాక్టరీని తెరిపించ‌లేక‌పోవడం, అన్నీ విషయాల్లో దూకుడు ప్రదర్శించడం కూనకి మైనస్ కానున్నాయి. అటు వైసీపీ అభ్యర్ధి తమ్మినేని....నియోజ‌క‌వ‌ర్గంలో తన అనుభవంతో కేడర్‌ని బలోపేతం చేయడం. అలాగే ప్రభుత్వ వైఫల్యాలని ఎండగడుతూ ముందుకు వెళ్లారు. వీటికి తోడు వరుసగా ఓడిపోతున్న సెంటిమెంట్, ఎమ్మెల్యే మీదున్న వ్యతిరేకత కూడా కలిసొచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే చాలా పార్టీలు మారడం, ప్రజలకి పెద్దగా అందుబాటులో లేకపోవడం, వివాదాల్లో చిక్కుకోవడం తమ్మినేనికి మైనస్. కానీ జగన్ పాదయాత్ర తర్వాత ఇక్కడ కొంత వైసీపీకి అనుకూల వాతావరణం ఏర్పడింది. 


ఇక ఈ నియోజకవర్గంలో కళింగ ఓటర్ల హవా ఎక్కువ. ఇక్కడ దాదాపు 59 వేల ఓట్లు కళింగులువే. వీరితో పాటు 38 వేల వరకు ఉన్న తూర్పు కాపులు కూడా అభ్యర్ధుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. అలాగే ఎస్సీ, పొలినాటి వెలమ, యాదవ సామాజికవర్గ ఓట్లు కూడా బాగానే ఉన్నాయి. ఇక మొత్తం మీద చూసుకుంటే తమ్మినేని-కూనల మధ్య టఫ్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. గెలిచే అవకాశాలు ఇద్దరికీ సమానంగానే ఉన్నాయి. అయితే ఎన్నికల రోజు చోటుచేసుకునే పరిణామాలు బట్టి ఫలితం ఆధారపడి ఉంటుంది. మరి ఈ బావాబామ్మర్దుల సవాల్‌లో విజేతలు ఎవరవుతరో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: