రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అతికొద్ది నియోజకవర్గాల్లో మంగళగిరి ముందుంటుంది. ఎందుకేంటే ఇక్కడ సిట్టింగ్ వైసిపి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డిని నారావారి పుత్రరత్నం నారా లోకేష్ పోటీ చేస్తున్నారు. మామూలుగా అయితే ఆళ్ళ ముందు ఏ విషయంలో కూడా లోకేష్ నిలబడలేరు. కానీ అధికారంలో ఉన్నారు దానికితోడు డబ్బుకు లోటులేదు. కాబట్టి పై రెండింటిని అడ్డుపెట్టుకుని గెలవాలని తెలుగుదేశంపార్టీ చేయని  ప్రయత్నం లేదు.

 

నిజానికి పోలింగ్ కు ఇక ఒకరోజే సమయం ఉన్నా కచ్చితంగా లోకేష్ గెలుస్తాడనే నమ్మకం లేదు. క్షేత్రస్ధాయిలో ప్రలోభాలు ఆ స్ధాయిలో నడుస్తోంది మరి. సరే టిడిపి పాటికి టిడిపి తన ప్రయత్నాలు తాను  చేసుకుంటోంది. అదే సమయంలో ఆళ్ళ కూడా జనాలను మాత్రమే  నమ్ముకుని తన మానాన తాను ప్రచారం చేసుకుంటున్నారు. మొత్తంమీద మంగళగిరిలో ఎవరు గెలుస్తారంటే ఠపీమని ఎవరు చెప్పలేకున్నారు.

 

ఇటువంటి సమయంలోనే జగన్మోహన్ రెడ్డి మంగళగిరిలో రోడ్డుషోకు వస్తున్నారు. ఇప్పటి వరకూ జగన్ పాల్గొన్న ప్రతీ రోడ్డుషో బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యింది. వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల కూడా ఇక్కడ రోడ్డుషోలు నిర్వహించారు. వాళ్ళు రోడ్డు షోలు నిర్వహించటం వేరు జగన్ రోడ్డుషో వేరన్నది అందరికీ తెలిసిందే. అందుకే జగన్ పాల్గొంటున్న రోడ్డుషోతో విజయం ఎవరిదన్న విషయంలో ఓ అంచనాకు రావచ్చని స్ధానికులు అనుకుంటున్నారు.

 

 మామూలుగా అయితే ఐదేళ్ళ చంద్రబాబు పాలనపై ఆళ్ళ చేసినన్ని పోరాటాలు ఎవరూ చేయలేదు. రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వటం ఇష్టంలేని రైతుల తరపున ఆళ్ళ ఎన్నో పోరాటాలు చేశారు. కోర్టులో కేసులు వేసి బలవంతపు భూ సేకరణకు వ్యతిరేకంగా కోర్టుల్లో స్టేలు పట్టుకొచ్చారు. సొంత ఖర్చులు పెట్టుకుని మధ్య తరగతికి కాయగూరలు పంపిణీ  చేస్తున్నారు. పేదలకు 5 రూపాయలకే ఉచిత భోజనాలు పెడుతున్నారు. ఇలా చెప్పుకుంటు పోతే చాలానే ఉన్నాయి.  ఆళ్ళ చేసిన పోరాటాలకు జగన్ రోడ్డుషో ద్వారా ప్రతిఫలం దక్కుతుందని వైసిపి భావిస్తోంది. మరి ఏమవుతుందో చూడాలి

 


మరింత సమాచారం తెలుసుకోండి: