సమకాలిన రాజకీయాలకు అనుగుణంగా అక్కడ ప్రజల్లో మార్పులు చోటుచేసుకోవడం కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం పత్యేకత. 1952లో ఏర్పడిన ఈ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు 16 మంది ఎంపీలు ఎన్నిక అయ్యారు. వీరిలో కమ్యూనిస్ట్‌ పార్టీ నుంచి ఒకరు, కాంగ్రెస్‌ నుంచి పది మంది విజయం సాధించగా తెలుగుదేశం నాలుగు సార్లు ఈ నియోజకవర్గంలో తన జెండా ఎగరవేసింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున కొనకళ్ల నారాయణరావు ఎంపీగా ఉన్నారు. 2009, 2014 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన ఆయన ఈ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలని ఊవిళ్లూరుతున్నారు. కాని వాస్తవంగా నియోజకవర్గంలో ఉన్న గ్రౌండ్‌ రిపోర్ట్‌ చూస్తే కొనకళ్ల హ్యాట్రిక్‌ కలగానే మిగిలిపోనుందా అంటే అవుననే ఆన్సర్లు వినిపిస్తున్నాయి. 


ఈ నియోజకవర్గంలో మచిలీపట్నం, అవనిగడ్డ, పెడనా, పామర్రు, గుడివాడ, గన్నవరం, పెనమలూరు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. గత రెండు ఎన్నికల్లోనూ గెలుస్తూ వస్తున్న కొనకళ్ల నారాయణ హ్యాట్రిక్‌ విజయం సాధించాలన్న పట్టుదలతో ప్రచార బరిలో ముందు ఉన్నారు. కొనకళ్లకు 2009లో వచ్చిన మెజారిటీ కన్నా గత ఎన్నికల్లో ఎక్కువ మెజారిటీ వచ్చింది. అయితే ఈ ఎన్నికల్లో ఒక్క పెనమలూరు నుంచే ఏకంగా 35,000 ఓట్ల మెజారిటీ రావడంతో కొనకళ్లకు 70,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఓ ఎంపీగా గతంలో పని చేసిన కావూరు సాంబశివరావు, బాడిగ రామకృష్ణ లాగా నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన ముద్ర వెయ్యడంలో కొనకళ్ల ఘోరంగా విఫలం అయ్యారన్న వాధన మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గ ప్రజల నుంచి వినిపిస్తోంది. కావూరి సాంబశివరావు, బాడిగ రామకృష్ణ ఈ నియోజకవర్గానికి రైళ్ల విషయంలోకాని, ఇతరితర కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా పలు అభివృద్ధి పనులు చేపట్టారు. కొనకళ్ల మాత్రం వరుసగా రెండు సార్లు గెలిచినా ఆయన నియోజకవర్గానికి చేసిందేమి లేదన్న టాక్‌ ఆయనపై ఉంది. 


ఇక గత ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ నుంచి అప్పటి వరకు మంత్రిగా ఉన్న కొలుసు పార్ధసారదిని కొనకళ్లపై రంగంలోకి దింపింది. ఆ ఎన్నికల్లో ఓడిన పార్ధసారది ఈ సారి ఆయన గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన పెనమలూరు నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. 2004, 2009 ఎన్నికల్లో వైఎస్‌ ఈ సీటును కాపు సామాజికవర్గానికి చెందిన బాడిగ రామకృష్ణకు ఇచ్చారు. 2014 ఎన్నికల్లో జగన్‌ ఇందుకు భిన్నంగా బీసీ వర్గానికి చెందిన పార్ధసారదిని ఎంపీగా పోటీ చేయించారు. ప్రస్తుత ఎన్నికల్లో జగన్‌ తెనాలి మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరిని ఇక్కడ నుంచి పోటీ చేయిస్తున్నారు. గత నాలుగు లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు వేరు వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన అరుదైన రికార్డు బలశౌరికే దక్కింది. 2004లో తెనాలి నుంచి ఎంపీగా గెలిచిన ఆయన 2009లో నరసారావుపేట నుంచి కాంగ్రెస్‌ తరపున, 2014లో గుంటూరు నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం జిల్లా మారి మచిలీపట్నం నుంచి వైసీపీ తరపున బరిలో ఉన్నారు. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌కు అత్యంత సన్నిహితుడు అయిన బాలశౌరి నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. 


నియోజకవర్గ పరిదిలో కాపు సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉండడంతో పాటు, వైసీపీ వేవ్‌, నవరత్నాలు బాలశౌరికి కలిసిరానున్నాయి. సిట్టింగ్‌ ఎంపీపై ఉన్న వ్యతిరేఖతతో పాటు లోక్‌సభ నియోజకవర్గ పరిదిలో బందరు, పెడన, పామర్రు, అవనిగడ్డలో వైసీపీ అభ్యర్థులు గెలుపు బాటలో ఉండడం బాలశౌరికి ప్లస్‌. గుడివాడలో కొడాలి నాని గెలుపుకన్నా మెజారిటీ మీదే చర్చలు నడుస్తున్నాయి. ఇక పెనమలూరులో మాత్రమే టీడీపీకి స్పష్టమైన ఆధిక్యం కనపడుతుండగా ఇక్కడ కూడా గతంకన్నా ఆ పార్టీ మెజారిటీ చాలా తగ్గుతుందంటున్నారు. గన్నవరంలోనూ సిట్టింగ్‌ ఎమ్మెల్యే వంశీ వర్సెస్‌ వైసీపీ అభ్యర్థి యర్లగడ్డ వెంకట్రావు మథ్య హోర హోరి పోరు నడుస్తోంది. ఇక్కడ ఎవరు గెలిచినా మెజారిటీ స్వల్పమే అంటున్నారు. ఓవర్‌ ఆల్‌గా చూస్తే నియోజకవర్గంలో ఐదు సెగ్మెంట్లలో వైసీపీ దూసుకుపోతుండడంతో బాలశౌరి గెలుపు నల్లేరు మీద నడకగానే కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: