రెండు రోజుల్లో జరిగే పోలింగ్ లో ఓట్లేసేందుకు తెలంగాణా నుండి ఏపిలోని వివిధ ప్రాంతాలకు ఓటర్లు బయలుదేరుతున్నారు. 11వ తేదీ ఓట్లు వేసేందుకు తెలంగాణాలో సెటిలయిన ఏపి ఓటర్లు మంగళవారం సాయంత్రం నుండి తమ ఊర్లకు బయలుదేరుతున్నారు. తమ ఊర్లకు వెళ్ళే ఓటర్లు సంఖ్య మామూలుగా లేదు. తక్కువలో తక్కువ 18 లక్షల వరకూ ఉంటాయని ఓ అంచనా.  

 

ఉద్యోగ, ఉపాధి, వృత్తుల్లో స్ధిరపడాలన్న ఉద్దేశ్యంతో సంవత్సరాల తరబడి ఏపిలోని వివిధ ప్రాంతాల నుండి తెలంగాణాలోని వివిధ ప్రాంతాల్లో వచ్చేశారు.  తెలంగాణాలోని చాలా ప్రాంతాల్లో ఏపిలోని సెటిలర్లున్నప్పటికీ ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువమందున్నారు. గ్రేటర్ పరిధిలోని కుకుట్ పల్లి, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, మల్కాజ్ గిరి, చేవెళ్ళ, ఉప్పల్, సికింద్రాబాద్, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి లాంటి నియోజకవర్గాల్లో చాలా ఎక్కువమందున్నారు.

 

లక్షల్లో ఉన్న  సెటిలర్లకు రెండు ప్రాంతాల్లోను ఓట్లున్నాయి. సెటిలయ్యింది తెలంగాణాలోనే అయినా తరచూ వారి సొంత ఊర్లకు వెళ్ళుతున్నందున రెండు చోట్ల ఓట్లను అట్టేపెట్టేకున్నారు. నిజానికి రెండు చోట్ల ఓట్లుండటం తప్పే. కానీ మన వ్యవస్ధలోని లోపాల వల్ల వీళ్ళందరికీ రెండు చోట్లా ఓట్లున్నాయి. మొన్నటి వరకూ రెండు ప్రాంతాల్లోను ఓట్లేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు రెండు ప్రాంతాల్లో ఒకేరోజు పోలింగ్ జరుగుతుండటంతో ఏదో ఒక చోట మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంది. దాంతో అందరూ తెలంగాణాలో ఓటును వదులుకుని ఏపికి  వెళిపోతున్నారు.

 

ఒక్కసారిగా లక్షలాది మంది ఓట్లు వేయటానికి ఏపిలోని తమ స్వస్ధలాలకు చేరుకుండంతో అభ్యర్ధుల్లో టన్షన్ మొదలైంది. ఎందుకంటే, మొన్నటి తెలంగాణా ముందస్తు ఎన్నికల్లో వీళ్ళంతా టిఆర్ఎస్ కే ఓట్లేశారు. చంద్రబాబునాయుడు, బాలకృష్ణతో పాటు అనేకమంది ప్రముఖులు ప్రచారం చేసినా టిడిపికి ఒక్కటంటే ఒక్కసీటు కూడా దక్కలేదు. అలాంటిది ఇపుడు లక్షల సంఖ్యలో ఏపికి బయలుదేరటంతో వీళ్ళంతా ఎవరికి ఓట్లేస్తారో అన్న అయోమయం పెరిగిపోతోంది.

 

తెలంగాణాలో సెటిలైన ఏపి వాళ్ళల్లో ఎక్కువభాగం ఉభయగోదావరి జిల్లాలు, రాజధాని జిల్లాలైన గుంటూరు, కృష్ణ, కర్నూలు, ప్రకాశం, విశాఖపట్నం, శ్రీకాకుళంకు చెందిన ప్రాంతాల వారు ఎక్కువగా ఉన్నారని అంచనా. కాబట్టి వీళ్ళే అభ్యర్ధుల గెలుపోటముల్లో కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయి. తెలంగాణా ఎన్నికల్లో టిడిపికి వ్యతిరేకంగా ఓట్లేశారు కాబట్టి రేపటి ఏపి ఎన్నికల్లో కూడా టిడిపికి వ్యతిరేకంగానే ఓట్లేస్తారనే అంచనాలేసుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: