ఆంధ్రజ్యోతి పత్రిక వైసీపీపైనా, జగన్ పైనా.. ఆ పార్టీ నేతలపైనా విషం చిమ్మేలా వార్తలు రాస్తోందన్నది వైసీపీ నేతల అభియోగం.. ఈ మాట ఇప్పటి నుంచి కాదు.. ఎప్పటి నుంచో చెబుతున్నారు. అయితే.. ఇప్పుడు ఏకంగా తమవి కాని ఆడియోలు కూడా తమ పేరిట ప్రసారం చేస్తూ ఎన్నికల ముందు దుష్ప్రచారం చేస్తోందని మండిపడుతున్నారు. 


మొన్న విజయసారెడ్డి ఆంధ్రులను కించపరిచారంటూ ఆంధ్రజ్యోతి పత్రిక, ఛానల్ ఓ ఆడియో ప్రసారం చేసి రోజంతా హంగామా చేశాయి. దీనిపై విజయసారెడ్డి మండిపడ్డారు. అంతటితో ఆగని ఆయన ఆంధ్రజ్యోతి దిన పత్రిక, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఛానల్‌తో పాటు ఆ ఛానల్‌ ఎండీ వేమూరి రాధాకృష్ణపై కేసు పెట్టారు. 

ఈ అంశంపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం క్రిమినల్‌ కేసు నమోదు అయింది. తనది కాని వాయిస్‌ను డబ్బింగ్‌ చేసి ఏబీఎన్‌ ఛానల్‌లో పదే పదే ప్రసారం చేస్తూ తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించడమే కాకుండా, అసత్య ప్రచారం చేస్తూ.. తెలుగు రాష్ట్రాల ప్రజల మనోభావాలు దెబ్బతీశారంటూ విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. 

న్యాయ సలహా తీసుకున్న తర్వాత పోలీసులు సెక్షన్లు 171సి, 171జీ, 171ఎఫ్, 469,505(2) కింద కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి త్వరలో పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు. ఈ నెల 5వ తేదీన తనదికాని వాయిస్‌తో ఏబీఎన్‌ ఛానల్‌లో ఏపీ ప్రజలకు నిబద్ధత లేదు అన్నట్లుగా ప్రసారం చేశారని.. శనివారం కూడా ఈ అంశంపై చర్చా వేదిక ఏర్పాటు చేశారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డి .. రాధాకృష్ణను వదిలేలా లేరు.



మరింత సమాచారం తెలుసుకోండి: