ఏపీలో పోలింగుకు మరి కొద్ది గంటల సమయం మాత్రమే ఉన్న వేళ ప్రతీ ఒక్కరిలోనూ హై రేంజ్‌ టెన్షన్‌ నెలకొంది. పోలింగ్‌ సరళి ఎలా ఉంటుంది? ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారు, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తోంది అన్న లెక్కల్లో ఎవరికి వారు మునిగిపోయారు. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటగా ఉన్న ఓ రాజధాని జిల్లాలో ఒకే జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఓడిపోతారంటూ బెట్టింగ్‌ రాయుడ్లు కాయ్‌ రాజా కాయ్‌ అంటూ కోసు పందాలు ఇచ్చి మరీ సవాళ్లు చేస్తున్నారు. జిల్లాలో మూడు కీలక స్థానాల నుంచి ముగ్గురు మంత్రులు పోటీలో ఉన్నారు. ఈ మూడు స్థానాలతో పాటు ఓ యువనేత పోటీ చేస్తున్న స్థానంతో పాటు నగరానికి ఆనుకుని ఉన్న మరో కీలక నేత పోటీ చేస్తున్న స్థానంపైనా ఎక్కువగా బెట్టింగులు జరుగుతున్నాయి. 


యువనేత పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఆ యువనేత గెలుస్తాడని టీడీపీ బెట్టింగ్ రాయుళ్లు, కాదు కాదు అక్కడ వైసీపీ నుంచి పోటీ చేస్తు ఓటమి లేకుండా వరుస విజయాలు సాధిస్తున్న సీనియర్‌ గెలుస్తాడని వైసీపీ బెట్టింగ్‌ రాయుళ్లు హోరా హోరీగా పందాలకు దిగుతున్నారు. పందెంలో రూపాయికి రెండు రూయాయిలు కూడా ఓ పార్టీ వారు ఇచ్చేందుకు వెనుకాడడం లేదు. ఇక నగరానికి ఆనుకుని ఉన్న మరో కీలక నేత గెలుపుకన్నా మెజారిటీపై ఎక్కువ బెట్టింగ్‌ నడుస్తోంది. ఈ జిల్లాల్లో పోటీ చేస్తున్న ఓ మంత్రిని ఎలాగైనా ఓడించాలని పట్టుదలతో ఉన్న వైసీపీ అధిష్టానం ఆర్థికంగా సామాజికంగా ఆ మంత్రికి సరిసమానమైన అభ్యర్థిని రంగంలోకి దింపింది. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చెయ్యనంత ఖర్చునే అక్కడ వైసీపీ నాయకులు చేస్తున్నారు.

ఇక వైసీపీ అభ్యర్థి భారీగా ఖర్చు చేస్తు దూసుకుపోతుండడంతో ఆ మంత్రి సైతం డైలమాలో ఉన్నారు. సదరు మంత్రి సైతం కోట్లాది రూపాయిలు బయటకు తీస్తే తప్పా విజయం సాధించలేని పరిస్థితి ఉంది. దీంతో ఆ మంత్రి గెలుస్తాడని టీడీపీ, శ్రేణులు, వైసీపీ అభ్యర్థే గెలుస్తాడని వైసీపీ శ్రేణులు లక్షల్లో పందాలు కాస్తున్నారు. మరికొందరు ఆ మంత్రి గెలిచినా మెజారిటీ రాదన్న అంశంపైన పందాలకు దిగుతున్నారు. 


ఇక జిల్లాల్లో మరో కీలక కేంద్రం నుంచి పోటీ చేస్తున్న మంత్రి ఈ సారి గ్యారెంటీగా ఓడిపోతారని ఎక్కువ మంది పందెం కాస్తున్నారు. ఆ నియోజకవర్గంలో మూడు పార్టీల నుంచి బలమైన అభ్యర్థులు ఉండడంతో అందరి దృష్టి అక్కడే ఉంది. అక్కడ జనసేన అభ్యర్థి చీల్చే ఓట్లతో ఎవరికి నష్టం కలుగుతుందనే అంశంపై సైతం అక్కడ గెలుపు ఓటములు ఆధారపడి ఉన్నాయి. దీంతో ఎవరి లెక్కలు వారు వేసుకుంటూ ఆ స్థానంపై లక్షల్లో పందాలు కాస్తున్నారు. కొందరు అయితే జనసేన అభ్యర్థి గెలుస్తారని కూడా పందాలు కాస్తుండడం విశేషం. టీడీపీకి పట్టున్న ఒకే జిల్లాలో ఇద్దరు మంత్రుల గెలుపు ఓటములపై ఈ రేంజులో కోట్లాది రూపాయిలు బెట్టింగ్‌ జరగడం విశేషంగానే చెప్పుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: