జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తన సొంత జిల్లా పశ్చిమగోదావరిలోని భీమవరంతో పాటు విశాఖ జిల్లా గాజువాకలోనూ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ కాపు సామాజికవర్గం ఓట్లు 70,000 ఉండడంతో పవన్‌ కులాన్నే నమ్ముకుని ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడన్న అపవాధు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పటికే భీమవరంలో పవన్‌ గెలుపు సులువు కాదని ఆ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్‌ విజయపు అంచుల్లో దూసుకుపోతున్నాడని విశ్లేషణలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఇక పవన్‌ ఆశలన్నీ విశాఖ జిల్లాలోని గాజువాకపైనే ఉన్నాయి. 


ఎన్నికల ముందు వరకు గాజువాక నియోజకవర్గంలో ఉన్న సమస్యలుగాని, అక్కడ ప్రజలనుగాని ఏ మాత్రం పట్టించుకోని పవన్‌ ఇప్పటికిప్పుడు ఎన్నికల వేళ అక్కడ ఊడిపడి నామినేషన్‌ వేసి ఏవో మొక్కుబడిగా రెండు సభలు పెడితే ప్రజలు పవన్ ను ఎలా గెలిపిస్తారన్న సందేహాలు కామన్‌ మెన్‌కు సైతం రావడం సహజం. హుద్‌హుద్‌ తుఫాన్‌ వచ్చినప్పుడు మిగిలిన రాజకీయ పక్షాలన్నీ ఇక్కడ ప్రజల సమస్యల కోసం ఎంతో కలిసికట్టుగా పోరాటం సాగించాయి. విశాఖ నగర ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు తూ తూ మంత్రపు ప్రకటనలతో సరిపెట్టిన జనసేనని ఇప్పుడు గాజువాకలో పోటీ చేసినా ఆదరణ కరువు అయ్యింది. పవన్‌ ఓ వైపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసుకోవడానికే టైమ్‌ లేని పరిస్థితి. పవన్ను నమ్ముకుని పోటీ చేస్తున్న చాలా మంది నేతలకే పవన్‌ ప్రచారం చెయ్యడం లేదు. గాజువాకలో జనసేన నాయకుల్లో కీలక నేతగా ఉన్న కోణ తాతారావుకు పవన్‌ విశాఖ తూర్పు సీటు కేటాయించడంతో ఆయన అక్కడ ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో గాజువాకలో పవన్‌ తరపున ప్రచారం చేసేందుకు సరైన నేతలే కరువయ్యారు. 


2009లో ఈ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి 10,000 ఓట్ల తేడాతో విజయం సాధించిన చింతలపూడి వెంకటరామయ్య ప్రస్తుతం పెందుర్తి నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో ఇదే నియోజకవర్గానికి చెందిన ఇద్దరు కీలక నేతలకు పవన్‌ పక్క నియోజకవర్గాల్లో సీట్లు ఇవ్వడంతో వారు తమ నియోజకవర్గాల్లో ప్రచారంలో నిమగ్నం అయ్యారే తప్పా గాజువాకలో పవన్‌ గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ రాంగ్‌ స్టెప్పలన్నీ రేపు ఎన్నికల వేళ పవన్‌కు మైనెస్‌ కానున్నాయి. మరో వైపు నియోజకవర్గంలో ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా పని చేసిన పల్లా శ్రీనివాస్‌ టీడీపీ నుంచి బలమైన అభ్యర్థిగా ఉన్నారు. ఇక వైసీపీ నుంచి గత రెండు ఎన్నికల్లోనూ ఓడిపోయిన తిప్పల నాగిరెడ్డిపై సానుభూతి పవనాలు బలంగా వీస్తున్నాయి. తిప్పల నాగిరెడ్డి గతంలో గాజువాక హౌసింగ్‌ సొసైటీ ఛైర్మెన్‌గా పని చేసి ఎంతో మంది పేదలకు సాయం చెయ్యడంతో ఇప్పుడు వారంతా నాగిరెడ్డికి సపోర్ట్‌ చేస్తున్నారు. మరో వైపు పల్లా శ్రీనివాస్‌కు సైతం టీడీపీ వర్గాల నుంచి బలమైన సపోర్ట్‌ ఉంది. దీంతో ఇద్దరు బలమైన ప్రత్యర్థుల మథ్యలో ఇరుక్కున పవన్‌ గెలుపు కోసం ఏటికి ఎదురీదుతున్న పరిస్థితి కనిపిస్తోంది. 


దీనికి తోడు ఇదే నియోజకవర్గానికి చెందిన ఇద్దరు కీలక నేతలు సైతం వేరే నియోజకవర్గంల్లో జనసేన నుంచి పోటీ చేస్తుండడం పెద్ద రాంగ్‌ స్ట్రేటజీనే. ఇక వైసీపీ నుంచి పోటీ చేస్తున్న తిప్పల నాగిరెడ్డికి నియోజకవర్గంలో ఆయన సామాజికవర్గం ఎక్కువ మంది లేకపోవడం మైనెస్‌ అయితే పల్లం శ్రీనివాస్‌కు గత ఎన్నికల్లో వన్‌ సైడ్‌గా సపోర్ట్‌ చేసిన కాపు వర్గం ఓట్లు చీలిపోవడం మైనెస్‌ కానున్నాయి. ఏదేమైన భీమవరంలో పవన్‌ గెలుపుపై జనసేన శ్రేణులకే ఫుల్‌ డౌట్‌ ఉందంటే గాజువాకలోనే అదే పరిస్థితి ఉండడాన్ని బట్టీ చూస్తే పవన్‌ తన అన్న చిరంజీవిలా ఒక చోట ఓడి ఒకచోట అయినా గెలిచి పరువు నిలుపుకుంటాడా లేదా రెండు చోట్ల ఓడతాడా అన్న చర్చలు ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: