అదృష్టాన్ని పక్కనపెట్టి వాస్తవాలను ఆలోచిస్తే అందరినోట వినబడుతున్న మాట మాత్రం ఇదే. తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ఎంఎల్ఏని జగన్ ఏరికోరి పార్టీలోకి తీసుకున్నారు. పార్టీలోకి తీసుకోవటమే కాకుండా ఏకంగా టికెట్ ను కూడా ఇచ్చేశారు. దాంతో ఐదేళ్ళ పాటు ఎవరిపైనైతే వైసిపి నేతలు పోరాటం చేశారో ఆ ఎంఎల్ఏకే పనిచేయాల్సిన దుర్గతి వచ్చింది. అందుకనే కొందరు నేతలు పార్టీకి దూరమయ్యారు.

 

ఇదంతా ఎవరి గురించి చెబుతున్నామో ఈపాటికే అర్ధమైపోయుంటుంది. అవును ఆయనే ప్రకాశం జిల్లాలోని చీరాలలో పోటీ చేస్తున్న ఆమంచి కృష్ణమోహన్ గురించే. పోయిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా గెలిచిన ఆమంచి తర్వాత టిడిపిలో చేరారు. అక్రమ సంపాదనకు పూర్తిగా లాకులెత్తేశారు. తనకు ఎదురు తిరిగిన వారితో పాటు తనంటే గిట్టనివారిపైన కూడా ఎన్నో కేసులు పెట్టించారు. చీరాలలోని ప్రభుత్వ యంత్రాగాన్ని గుప్పిట్లో పెట్టుకుని ప్రత్యర్ధులకు చుక్కలు చూపించారు. బాధితుల్లో ఎక్కువమంది వైసిపి నేతలే.

 

రాబోయే ఎన్నికల్లో ఆమంచి ఓటమి ఖాయమనే చర్చ జోరుగా సాగుతోంది. అటువంటి సమయంలో హఠాత్తుగా ఆమంచి వైసిపిలో చేరారు. ఊహించని ఘటనతో వైసిపి నేతలు షాక్ కు గురయ్యారు. పార్టీలో ఆమంచి చేరటాన్ని వ్యతిరేకించినా ఉపయోగం లేకపోవటంతో చాలామంది చేసేదిలేక పార్టీని వదిలేశారు. ఎప్పుడైతే ఆమంచి పార్టీని వదిలేసి వైసిపిలో చేరారో చంద్రబాబునాయుడు నెత్తిన పాలుపోసినట్లైంది.

 

అదే అదునుగా అద్దంకిలో పార్టీకి పెద్ద తలనొప్పిగా తయారైన ఎంఎల్సీ కరణం బలరామ్ ను వెంటనే చీరాలకు షిఫ్టు చేసి బాధ్యతలు అప్పగించారు. చివరకు టికెట్ కూడా ఇచ్చారు. దాంతో ఆమంచి అంటే పడనివారందరూ ఇపుడు కరణం గెలుపుకు సహకరిస్తున్నారు.  

 

చీరాలలో గట్టి నేత లేకపోయినా మంచి పేరున్న ప్రముఖునికో లేకపోతే ఓ మాదిరి నేతనో తీసుకొచ్చి పోటీ చేయించినా గెలుపు వైసిపిదే అయ్యేదని అందరూ అనుకుంటున్నారు. చీరాలలో గెలిచే బంగారం లాంటి అవకాశాన్ని జగనే చేతులార పాడు చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. మరి ఆమంచి అదృష్టం ఎలాగుందో చూడాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: