ఏపీలో జగన్ ప్రభంజనం కనిపిస్తోంది.. ఆయన పార్టీ సులభంగా 130 స్థానాలకు పైగా గెలుచుకుంటుందని.. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ జోస్యం చెప్పారు. టీడీపీ పని అయిపోయిందని, చంద్రబాబు హెరిటేజ్‌ వ్యాపారం చేసుకుంటూ విశ్రాంతి తీసుకోవాల్సిందేనని అసదుద్దీన్ ఎద్దేవా చేశారు. గతంలో ఏపీలోనూ ప్రచారం చేస్తానన్న ఆయన ఆ తర్వాత ఆ నిర్ణయం మార్చుకున్నారు. 


వైసీపీ, టీఆర్ఎస్‌లు 37 వరకూ ఎంపీ స్థానాలు గెలుచుకుంటారని.. ఆయన అన్నారు. జగన్‌, కేసీఆర్‌లు మోదీకి బీ టీమ్ అని చేస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ఎన్నికల అనంతరం ప్రధాని ఎవరనేది, ఇప్పుడే చెప్పలేమని, కాంగ్రెస్‌కు 150 సీట్లొస్తే రాజకీయం మరింత రసవత్తరంగా మారుతుందన్నారు. 

ఎన్డీయేకు గతంలో వచ్చిన సీట్లు కూడా రావని, కేసీఆర్‌ ప్రతిపాదిస్తున్న ఫెడరల్‌ ఫ్రంట్‌కు 120 స్థానాలొస్తే ప్రధాని ఎవరనేది ఆసక్తికరంగా మారుతుందని పేర్కొన్నారు. అంతేకాదు, ప్రాంతీయ పార్టీ నేతల్లో చాలామందికి ప్రధాని అయ్యే సత్తా ఉందని తెలిపారు. 

పుల్వామా ఆత్మాహుతి దాడి, వైమానికి దాడుల సమయంలో కేంద్రానికి అండగా నిలిచామని, దేశ సార్వభౌమత్వానికి ముప్పు కలుగుతున్న సందర్భాల్లో పార్టీలకు అతీతంగా మద్దతిస్తున్నామని వివరించారు. అయితే, వీటిని రాజకీయ లబ్ది కోసం బీజేపీ తన ప్రచారాస్త్రాలుగా మార్చుకుంటే మాత్రం ప్రశ్నిస్తామని అసదుద్దీన్‌ వ్యాఖ్యానించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: