చంద్రబాబునాయుడు తాజాగా ఎన్నికల కమీషన్ కు రాసిన లేఖ చూస్తే విచిత్రంగా ఉంది. నిబంధనలను ఉల్లంఘించి ఇష్టా రాజ్యంగా చేసుకుంటున్నది చంద్రబాబు. ప్రభుత్వ యంత్రాంగాన్ని తన సొంతానికి వాడుకుంటున్నది చంద్రబాబు. కానీ ఉన్నతాధికారులను బదిలీ చేయటంపై  చీఫ్ ఎలక్షన్ కమీషనర్ కు ఫిర్యాదు చేస్తున్నది కూడా చంద్రబాబే. ఇంతమంది ఉన్నతాధికారులపై ఎన్నికల కమీషన్ ఎందుకు చర్యలు తీసుకుంటోంది ?

 

ఎందుకంటే, ప్రభుత్వ యంత్రాంగాన్ని తన సొంతానికి వాడుకుంటున్నది చంద్రబాబు కాబట్టే. ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు తానొక ప్రభుత్వ ఉద్యోగి అన్న విషయాన్ని మరచిపోయారు. చంద్రబాబు సొంతమనిషిగా వ్యవహరించటమే కాకుండా వైసిపిని బాగా ఇబ్బంది పెట్టారు. దాంతో వైసిపి ఆధారాలతో సహా చేసిన ఫిర్యాదుతో ఐ చీఫ్ పై బదిలీ వేటు వేసింది. అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనీల్ చంద్ర పునేఠాపైన కూడా వేటు పడింది. ఇద్దరు ఎస్పీల బదిలీకి కూడా ఇదే కారణం.

 

వాస్తవాలు ఇలా వుండగా చంద్రబాబు మాత్రం రివర్సులో మాట్లాడుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ప్రభుత్వం యంత్రాంగం మొత్తం ఎన్నికల కమీషన్ అదుపాజ్ఞల్లోకి వెళిపోతుంది. ఈ విషయం ప్రతీ ఒక్కరికీ తెలుసు. అంటే యంత్రాంగంపై ముఖ్యమంత్రి, మంత్రులతో పాటు అధికారపార్టీకి కూడా ఎటువంటి అదుపు ఉండదు. కానీ వాస్తవంగా జరుగుతున్నదేంటి ? చంద్రబాబునాయుడు రివ్యూలు పెట్టారు. ఉన్నతాధికారులను ఇంటికి పిలిపించుకుని మాట్లాడారు. అధికారిక నివసం నుండే మీడియా సమావేశాలు నిర్వహించారు. యధేచ్చగా చంద్రబాబు కోడ్ ఉల్లంఘిస్తు ప్రత్యర్ధులపై ఫిర్యాదు చేయటం ఆశ్చర్యంగా ఉంది.

 

అక్కడేకేదో ఎన్నికల కమీషన్ లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వైసిపి కనుసన్నల్లో నడుస్తున్నట్లుంది చంద్రబాబు ఫిర్యాదు చూస్తే.  చంద్రబాబు జేబులో మనిషిగా మారినందుకే ఏబి వెంకటేశ్వరరావు పై ఈసి చర్యలు తీసుకుంది. ఐబి చీఫ్ బదిలీ విషయంలో చంద్రబాబు ఒత్తిడికి లొంగినందుకే పునేఠాపై చర్యలు తీసుకుంది. పైగా చీఫ్ సెక్రటరీపై ఎందుకు చర్యలు తీసుకోవటం అన్యాయమంటూ చంద్రబాబు గొంతెత్తి అరవటమే విచిత్రంగా ఉంది.

 

ఫారం 7 విషయంలో టిడిపి ఇచ్చిన ఫిర్యాదులపై వైసిపి పై ఈసి చర్యలు తీసుకోలేదనే పనికిమాలిన ఫిర్యాదు చేశారు. ఫారం 7 దాఖలు చేయటం నేరం కాదని ఈసినే ఎన్నోసార్లు ప్రకటించింది. కాబట్టి  చేయని నేరానికి వైసిపిపై ఈసి ఎలా చర్యలు తీసుకుంటుంది ? ఓట్లు తొలగించిందే టిడిపి అంటూ వైసిపి నేతలు ఫారం 7 దాఖలు చేసినట్లు స్వయంగా జగన్మోహన్ రెడ్డే చెప్పారు. కాబట్టి తప్పులన్నీ తాను చేస్తు తమ ఫిర్యాదులపై ఈసి చర్యలు తీసుకోవటం లేదని గోల చేయటమే చంద్రబాబు స్పెషాలిటీ.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: