చూడబోతే రాష్ట్రంలో సీన్ రవర్సయ్యేట్లుంది. అందుకనే చంద్రబాబునాయుడులో ఆందోళన పెరిగిపోతోంది. మామూలుగా అయితే ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే అవకాశం  ఎక్కువగా అధికారపార్టీకే ఉంటుంది. ఎందుకంటే, అధికారపార్టీ నేతలు చెప్పినట్లే యంత్రాంగంలో ఎక్కువమంది నడుచుకుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ప్రతిపక్షంతో పోల్చుకుంటే అధికారపార్టీకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందులోను టిడిపి అధికారంలో ఉంటే విషయం ఏదైనా కానీండి ఆకాశమే హద్దుగా చెలరేగిపోతోంది.

 

అలాంటిది ప్రభుత్వ యంత్రాంగంపైనే కాకుండా ఎన్నికల కమీషన్ పైన కూడా చంద్రబాబు దగ్గర నుండి ఎంఎల్ఏలుగా పోటీ చేస్తున్న అభ్యర్ధుల్లో కొందరు ఫిర్యాదులు చేస్తున్నారంటే అర్ధమేంటి ? అధికార వ్యవస్ధ వల్ల టిడిపి ఇబ్బందులు పడుతోందనే సరికొత్త డ్రమాకు చంద్రబాబు తెరలేపారు. అందులో భాగంగానే ఎన్నికల కమీషన్ తమ ఫిర్యాదులను పట్టించుకోవటం లేదంటూ చీఫ్ ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు కూడా చేశారు.

 

ఇక్కడ విషయం ఏమిటంటే సాధారణంగా అధికారపార్టీపై ప్రతిపక్షాలు ఫిర్యాదులు చేస్తుంటాయి. విచ్చలవిడిగా డబ్బులు, మద్యం పంచుతున్నది టిడిపి నేతలే. పట్టుబడుతున్నది కూడా అధికార పార్టీ నేతలే. ప్రలోభాలకు గురిచేస్తున్నది, ఓటర్లను బెదిరిస్తు సోషల్ మీడియాలో కనిపిస్తున్నదంతా పచ్చపార్టీ నేతలే. కానీ ఆరోపణలు చేస్తున్నది మాత్రం వైసిపి నేతలపైన. ఎందుకంటే, తామిచ్చిన ఫిర్యాదులపై అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవటం లేదట.

 

చాలా విచిత్రంగా ఉంది చంద్రబాబు అండ్ కో వాదన. అధికారంలో ఉన్న పార్టీ మాటను ప్రభుత్వ యంత్రాంగమే వినటం లేదంటే అర్ధమేంటి ? సీన్ రివర్సవుతోందనే కదా ? మొన్నటి వరకూ మళ్ళీ మనమే అధికారంలోకి రాబోయేదంటూ చంద్రబాబు ఒకటే ఊదరగొట్టారు. కానీ రెండు రోజులుగా ఓటర్లను బ్రతిమలాడుకుంటున్నారు. ఒంగి ఒంగి దండాలు పెడుతున్నారు. గడచిన 30 ఏళ్ళల్లో చంద్రబాబు ఇంతలా ఒంగిపోయి ఓటర్లను బ్రతిమలాడుకోవటం ఎవరూ చూసుండరు.

 

క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే చంద్రబాబు అవుట్ గోయింగ్ ముఖ్యమంత్రేనా అన్న అనుమానం వచ్చేసింది. దానికితోడు చంద్రబాబు బీదరపులు వింటున్న వారికి, ఉదయం టెలికాన్ఫరెన్సులో మాట్లాడిన విధానం బట్టి నేతలకు కూడా ప్రభుత్వంలో నుండి తట్టాబుట్టా సర్దుకోక తప్పదనే సంకేతాలు స్పష్టంగా కనబడ్డాయట. అందుకే చంద్రబాబులో అంతలా టెన్షన్ పెరిగిపోతోందని అంటున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: