ఆంధ్రాలో బెట్టింగ్‌ బంగార్రాజులు బిజీ బిజీ అయిపోయారు. ప్రతి ఏటా వేసవిలో ఇండియన్‌ ప్రీమియర్‌ లింక్‌ క్రికెట్‌ మ్యాచ్‌లపై పందాలు జోరుగా జరిగేవి. కానీ ఈ ఏడాది ప్రపంచ క‌ప్‌ వన్‌ డే క్రికెట్‌ మ్యాచ్ ఫైన‌ల్‌ను తలపిస్తున్నట్టుగా ఏపీలో సాధారణ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా ఎన్నికల బెట్టింగ్‌ల‌ జోరు కనిపిస్తోంది. పల్లెల్లో రచ్చబండలు, పొలాల్లో రైతులు, వ్యాపారులు ఎవరికి వారు మధ్య‌ వర్తుల సమక్షంలో రకరకాల పందాలను లక్షల్లో కాస్తున్నారు. పట్టణాల్లో అయితే రిసార్టులు, ఫామ్‌ హౌసులు, రెస్టారెంట్లు, హోటళ్లు ఇలా ఎక్కడ చూసినా బెట్టింగుల గురించే ఒకటే రకమైన చర్చలు నడుస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఉత్కంఠను పెంచేలా రకరకాల బెట్టింగులతో బెట్టింగ్ ముఠా నాయకులు తలమునకలై ఉన్నారు. ఏపీ ఎన్నికల్లో అధికార టీడీపీతో పాటు విపక్ష వైసీపీ, జనసేన కూటమి ప్రధానంగా పోటీ చేస్తున్నాయి. పేరుకే జనసేన కూటమి ఎన్నికల్లో పోటీలో ఉన్నా చాలా నియోజకవర్గాల్లో టీడీపీ, వైసీపీ మధ్యే ద్విముఖ పోటీ ఉంది. గోదావరి జిల్లాలతో పాటు విశాఖలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే త్రిముఖ పోటీ నెలకొంది. 


ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది, సీఎం ఎవరు ? గెలుపు ఎవరిది ? ఎవరు ఎన్ని ఓట్ల తేడాతో గెలుస్తారు ? ఏ జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ? ఎవరికి డిపాజిట్లు వస్తాయి ? ఎవరి మెజారిటీలు ఎంత ?మంత్రుల్లో ఎంత మంది ఓడతారు ? లాంటి అంశాల మీదే ఎక్కువగా బెట్టింగులు జరుగుతున్నాయి. ఇక ప్రాంతాల వారీగా చూస్తే రాయలసీమలో వైసీపీ జోరు ముందు మిగిలిన పార్టీలు కుదేల్‌ అవుతున్నట్టే తెలుస్తోంది. ఇక్కడ వైసీపీ సాధించే సీట్లతో పాటు ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అన్న అంశంపై వైసీపీ తరపున బెట్టింగ్‌ కాస్తున్న వారు దూకుడుగా ముందుకు వస్తున్నా మిగిలిన పార్టీల నుంచి కనీసం బెట్టింగ్‌ కాసేందుకు కూడా ఎవ్వరూ ముందుకు రాని పరిస్థితి. రాయలసీమలో ఉన్న నాలుగు జిల్లాల్లో మొత్తం 8 ఎంపీ సీట్లతో పాటు, 52 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఒక్క అనంతపురం జిల్లాలో మినహా మిగిలిన మూడు జిల్లాల్లోనూ వైసీపీ స్పష్టమైన ఆధిక్యాన్ని చాటింది. ఈ ఎన్నికల్లో రాయలసీమకు ఆధికార పార్టీ చేసిందేమి లేకపోవడంతో సీమ ఓటర్లంతా టీడీపీని తిప్పి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. 


వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సొంత జిల్లా కడపలో టీడీపీకి ఒక్క సీటు కూడా రాదని బెట్టింగ్‌ జరుగుతున్నా ఆ పార్టీ సపోర్టర్లు ఎవరూ బెట్టింగ్‌ కాసేందుకు ముందుకు రాని పరిస్థితి. దీనిని బట్టీ కడపలో ఎన్నికలకు ముందే టీడీపీ బేజారు అయ్యిందని స్పష్టంగా తెలుస్తోంది. ఇక చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోనూ వైసీపీ స్పష్టమైన ఆధిక్యంలో ఉందని ఇప్పటికే ప్రీ పోల్‌ సర్వేలు స్పష్టం చేశాయి. గత ఎన్నికల్లో ఈ జిల్లాల్లో వైసీపీ 8 సీట్లు గెలుచుకుని టీడీపీపై స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ఈ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి ఉంది. ఇక గత ఎన్నికల్లో టీడీపీ గెలుచుకున్న రెండు మూడు సీట్లలో ఆ పార్టీకి ఓటమి తప్పేలా లేదని ఆ పార్టీ వాళ్లే చెబుతున్నారు. ఇక టీడీపీ గత ఎన్నికల్లో 12 సీట్లు గెలుచుకున్న అనంతపురం జిల్లాలో టీడీపీలో ఉన్న వర్గ పోరే ఆ పార్టీని కొంప ముంచుతోంది. టీడీపీలో వర్గ పోరుతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలపై ఉన్న భయంకరమైన వ్యతిరేఖత కూడా టీడీపీ కొంప ముంచుతోంది. అనంతలో ఈ సారి వైసీపీ తిరుగులేని ఆధిక్యాన్ని చాటనుంది. 
కర్నూలు జిల్లాలో గత ఎన్నికల్లో అత్తెస‌రు మెజారిటీతో టీడీపీ మూడు సీట్లలో గెలిచింది. ఈ ఎన్నికల్లో త‌క్కువ మెజారిటీతో గెలిచిన ఆ మూడు సీట్లను కాపాడుకోవడమే ఆ పార్టీకి గగనంగా మారింది. ఇక 10 నుంచి 11 సీట్లలో తిరిగి వైసీపీ పాగా వెయ్యనుందన్న బెట్టింగులు జిల్లాలో జోరుగా జరుగుతున్నాయి. రాయలసీమలో పలు కీలక సెగ్మెంట్లలో వైసీపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని ఆ పార్టీ సానుభూతి పరులు పెద్ద ఎత్తున బెట్టింగులు కాస్తున్నా ఇతర పక్షాల నుంచి స్పందనే కరువవుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి రూపాయికి రెండు రూపాయిలు ఇస్తామంటూ సవాల్‌ చేసి మరీ బెట్టింగ్‌ల‌కు దిగుతున్నా ఇతర పార్టీ నేతల నుంచి కాసేందుకు ముందుకు రాని పరిస్థితి ఉంది. 


కొన్ని చోట్ల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసేలా అవగాహాన కుదుర్చుకుంటున్నారు. మరికొందరు బంగారు గొలుసులు, ఉంగరాలు సైతం పందాల్లో పెట్టేస్తున్నారు. ఇక యువత అయితే కార్లు, బైకులే కాకుండా ల్యాప్‌ట్యాప్‌లు, ట్యాబులు, ఖరీదైన ఫోన్లు సైతం పందాల్లో కాస్తున్నారు. రాయలసీమ అంతా ఈ సారి వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎలాగైనా సీఎం అవుతారని ఈ విషయంలో తిరుగులేదని ఛాలెంజ్‌ విసిరి మరీ బెట్టింగ్‌కు దిగుతున్నారు. ఏదేమైన రాయలసీమలో బెట్టింగులు జరుగుతున్న జోరు చూస్తుంటే సీమలో వైసీపీ ఫ్యాన్‌ గాలులు ముందు విపక్ష పార్టీలు పూర్తిగా వెనుకపడి పోవడమే కాకుండా పోటీ ఇచ్చే పరిస్థితి కూడా లేదని స్పష్టంగా తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: