ఏపీలో ఉత్కంఠ రేకెత్తించేలా ప్రచారం సాగింది. ప్రధాన పార్టీలు పోటాపోటీగా ఈసారి ఎన్నికల్లో ఢీ కొట్టాయి. విభజన తరువాత ఏపీకి జరిగే తొలి ఎన్నిక ఇది. అయిదేళ్ళ పాలనను చూసిన జనం ఇచ్చే ఈ తీర్పు ఎలా ఉంటుందో అన్న ఆసక్తి సర్వత్రా ఉంది.

 

ఆంధ్రరదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జనం తీర్పు ఈవీఎంల్లో నిక్షిప్తం కానుంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు పోలింగ్‌కు సిద్ధమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 3,93,45,717 మంది ఓటర్లు 49 వేల 520 పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు గురువారం తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల్లో మహిళా ఓటర్లు కీలకం కానున్నారు. మొత్తం ఓటర్లలో కోటి 98 లక్షల 79 వేల 421 మంది మహిళా ఓటర్లు, కోటి 94 లక్షల 62వేల 339 మంది పురుష ఓటర్లు ఉన్నారు. వీరితో పాటు 3967 మంది ట్రాన్స్‌జెండర్లు ఓటు వేయనున్నారు.

 

అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రంలోని 25 లోక్‌సభ, 175 శాసనసభ స్థానాల్లో తమ అభ్యర్థులను రంగంలో దించాయి. జనసేన 16 పార్లమెంట్ 137 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుండగా ఆ పార్టీ మద్దతుతో బీఎస్పీ 3 లోక్‌సభ, 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో, సీపీఐ, సీపీఎంలు నాలుగు లోక్‌సభ, 14 శాసనసభ స్థానాల్లో పోటీలో ఉన్నాయి. జాతీయ పార్టీలైన బీజేపీ 24 లోక్‌సభ, 173 అసెంబ్లీ స్థానాల్లోనూ, కాంగ్రెస్ పార్టీ 25 లోక్‌సభ 174 శాసనసభ స్థానాల్లో తలపడనున్నాయి. అసెంబ్లీ బరిలో 2118 మంది అభ్యర్థులు ఉండగా అందులో 1945 మంది పురుషులు, 172 మంది మహిళలు, ఓ ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి ఉన్నారు. లోక్‌సభ నియోజకవర్గాలకు 319 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో 292 మంది మహిళలు, 27 మంది పురుషులు ఉన్నారు.

 

 

 ఎన్నికల సందర్భంగా ప్రతి పోలింగ్ కేంద్రం పరిసరాల్లో సెక్షన్ 30 యాక్ట్ తో పాటు 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో పార్టీలు, అభ్యర్థుల గుర్తింపు సంకేతాలు లేకుండా ఓటరు స్లిప్‌లను పంచాలని నిర్దేశించింది. మద్యం సేవించి వస్తే ఓటింగ్‌కు అనుమతివ్వరు.  అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద నిఘా కెమెరాల నీడన ఎన్నికలు జరగనున్నాయి. వెబ్‌కాస్టింగ్‌తో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను ప్రభావితం చేస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. దొంగ ఓటు వేస్తే మూడేళ్ల జైలుశిక్ష తప్పదని హెచ్చరించారు. అభ్యర్థులు మినహా రాజకీయ పార్టీలకు చెందిన స్థానికేతరులు నియోజకవర్గాల్లో ఉండరాదన్నారు. తనిఖీల సమయంలో గుర్తింపు కార్డులు విధిగా చూపాలని విజ్ఞప్తి చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: