ఆయనో ఘనత వహించిన ఏపీ అసెంబ్లీ స్పీకర్‌. పైగా ఉన్నత చదువు చదివి డాక్టర్‌ అయ్యారు. పైగా తనకు మాత్రమే ప్రజాస్వామ్య విలువలు తెలుసునంటూ.. అనేక సందర్భాల్లో లెక్చర్లు కూడా దంచేశారు. అయితే, ఇప్పుడు ఎన్నికల సందర్భంగా మాత్రం ఆయన వ్యవహరిస్తున్న తీరు తీవ్ర వివాదానికి కారణమైంది. ఆది నుంచి గుంటూరు జిల్లా పల్నాడు ఫ్యాక్షన్‌ రాజకీయాలకు చాలా దగ్గరగా ఉండే మనస్తత్వం ఉన్న కోడెల.. ఇంట్లో 2005లో బాంబులు పేలిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక, ఇప్పుడు కూడా ఆయన ఇదే తరహా రాజీకీయాలు చేస్తున్నారని అంటున్నారు ప్రత్యర్థులు. గత ఎన్నికల్లో గుంటూరు జిల్లా సత్తెన పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు కోడెల.


ఇక, ఇక్కడ తనకు విజయం దక్కదని ఎప్పుడో నిర్ణయించుకున్నా కూడా చంద్రబాబు సూచనలు, సలహాల మేరకు మరోసారి ఇప్పుడు కూడా సత్తెనపల్లి నుంచే పోటీకి దిగారు. అయితే, ఇక్కడ తీవ్ర వ్యతిరేక పవనాలు వీస్తున్న విషయంలో కోడెలకు అర్ధమైంది. అయినప్పటికీ.. ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయాన్ని గౌరవించాల్సిన నాయకుడిగా ఆయన ఆదర్శంగా ఉండకుండా ఏకంగా పోలింగ్‌ బూతులపై దౌర్జన్యాలకు దిగారు. నేరుగా ఓ పోలింగ్‌ బూతులోకి వెళ్లిన కోడెల.. లోపలికి వెళ్లి తలుపులు మూసుకున్నారు. ఈ క్రమంలో అసలు ఏం జరుగుతోందో తెలియని పరిస్థితిలో ఓటర్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. 


ఇంతలోనే తేరుకుని ఎదురు తిరిగారు. ఇలా కేంద్రంలోకి వెళ్లి తలుపులు మూసుకోవడం ఏంటని కోడెలను ప్రశ్నించారు. అయితే, వీరికి సమాధానం చెప్పుకోలేక మూర్ఛ పోయినట్టుగా నటించడం ప్రారంభించారు కోడెల. ఇక, ఈయన పుత్రరత్నం ఏకంగా.. ముప్పాళ్ల మండలం, దమ్మాలపాడులోని పోలింగ్‌ కేంద్రానికి పోలీసు ఎస్సైను తీసుకుని బూత్‌లోకి వచ్చి ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రయత్నించాడు. మొత్తానికిఈ రెండు ఘటనలు కూడా సత్తెనపల్లిలో సంచలనంగా మారాయి. మరి ప్రజాస్వామ్యం గురించి, పార్లమెంటరీ వ్యవస్థల గురించి పెద్ద ఎత్తున లెక్చర్లు దంచే చండ్రబాబు దీనికి ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: