తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల హంగామా కొనసాగుతున్నది. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ఈరోజు ఉదయం ఏడు గంటలకు ప్రారంభం కాగా, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ బూతుల దగ్గర బారులు తీరుతున్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు సామాన్య ప్రజలతో పాటు సినీ ప్రముఖులు కూడా ఉత్సాహం చూపుతున్నారు. సినీ నటులు త‌మ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూ. ఎన్టీఆర్‌,  అల్లు అర్జున్, చిరంజీవి, రామ్ చరణ్,రాజమౌళి, సుధీర్ బాబు, కీరవాణి, తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.


అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న నిజామాబాద్ లోక్ స‌భ ప‌రిదిలోనూ పోలింగ్ ఊపందుకున్న‌ది. మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు ఆ నియోజ‌క‌వ‌ర్గంలో 38.10 శాతం ఓట్లు పోల‌య్యాయి. ఎండ‌లు దంచుతున్నా.. ఓట‌ర్లు భారీ సంఖ్య‌లో పోలింగ్ బూత్‌ల‌కు వ‌స్తున్నారు. 185 మంది పోటీలో ఉన్న కార‌ణంగా.. త‌మ అభ్య‌ర్థిని ఎంపిక చేసేందుకు ఓట‌ర్ల‌కు కొంత ఆల‌స్యం అవుతున్న‌ది. నిజామాబాద్‌లో ప్ర‌తి బూత్‌లో 12 ఈవీఎంల‌ను అమ‌ర్చారు. ఇక న‌ల‌గొండ‌లోనూ ఓటింగ్ భారీగా జ‌రుగుతున్న‌ది. ఎండ‌లు మండుతున్నా.. అక్క‌డ కూడా ఓట‌ర్లు పోటెత్తారు. న‌ల‌గొండ నియోజ‌క‌వ‌ర్గంలో మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు 42.09 శాతం ఓటింగ్ న‌మోదు అయ్యింది. క‌రీంన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలోనూ 45.62 శాతం పోలింగ్ న‌మోదైంది. పెద్ద‌ప‌ల్లిలో 47 శాతం న‌మోదైంది. 
తెలంగాణ‌లో అత్య‌ధికంగా మెద‌క్‌లో ఓటింగ్ న‌మోదు అయ్యింది. అక్క‌డ మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు 54 శాతం పోలింగ్ రికార్డు అయ్యింది. సికంద్రాబాద్‌, మ‌ల్కాజ్‌గిరిలో మాత్రం మ‌రీ మంద‌కొడిగా ఓటింగ్ సాగుతున్న‌ది. హైద‌రాబాద్‌లో ఒంటి గంట వ‌ర‌కు 20.59, సికింద్రాబాద్‌లో 23.85 శాతం ఓట్లు పోల‌య్యాయి. రాష్ట్ర‌వ్యాప్తంగా మ‌ధ్యాహ్నం ఒక‌టి వ‌ర‌కు స‌గ‌టున 38.30 శాతం పోలింగ్ న‌మోదు అయ్యింది.


మరింత సమాచారం తెలుసుకోండి: