తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 16 లోక్సభ స్థానాలకు ఓటింగ్ ముగిసింది. గతం కంటే పోలింగ్ శాతం తగ్గిందని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ 39.49 శాతం పోలింగ్, సికింద్రాబాద్ 39.20 శాతం, మల్కాజ్గిరి 42.75, మహబూబ్నగర్ 65, మెదక్ 68, జహీరాబాద్ 67.80, నల్లగొండ 66.11, నాగర్ కర్నూల్ 57.21, భువనగిరి 68.25, చేవెళ్ల 53.08, కరీంనగర్ 68, ఖమ్మం 67.92, ఆదిలాబాద్ 66.76, నిజామాబాద్ 54.20, పెద్దపల్లి 59.24, వరంగల్ 59.17, మహబూబాబాద్ 59.90 శాతం పోలింగ్ నమోదయింది. ఇదిలాఉండగా, నిజమాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోలింగ్ సాయంత్రం ఆరుగంటల వరకు కొనసాగింది.


పోలింగ్ ముగిసిన అనంతరం డీజీపీ మహేందర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరగకుండా పోలింగ్ జరిగిందన్నారు. 85 వేల మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారని వివరించారు. ఓటర్లు పోలీసులకు సహకరించారన్నారు. ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులకు పోలీస్ శాఖ తరుపున ధన్యవాదాలు తెలుపుతున్నామని వెల్లడించారు. సీల్ చేసిన ఈవీఎంలను రిసెప్షన్ సెంటర్కు తీసుకొచ్చిన తర్వాత స్ట్రాంగ్రూంలో భద్రపరుస్తామని డీజీపీ వివరించారు. మే 23 వరకు స్ట్రాంగ్ రూంల దగ్గర భద్రత కట్టుదిట్టంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. 


కాగా, గడువు ముగిసిన తర్వాత సైతం క్యూ లైన్లలో నిలుచున్న ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యూ లైన్లో వేచి ఉన్న ఓటర్లకు టోకెన్లు ఇచ్చి మరి ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో పూర్తి స్థాయిలో పోలింగ్ ముగిసేసరికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: