తీవ్ర ఉత్కంఠ రేపిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు ముగిశాయి. గత ఏడాది కాలంగా ఎంతో ఉత్కంఠతో... ఎన్నో అంచనాలతో నడుస్తూ వచ్చిన ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ సంగ్రామంలో తెలుగుదేశం వైసీపీ మధ్య అదిరిపోయే వార్‌ జరిగింది. ఎన్నికలు ముగియడంతో రాజకీయ విశ్లేషకులు, మేథావులు మీడియా వర్గాలు టిడిపి, వైసీపీ మధ్య నెట్ నెక్ ఫైట్ నడిచిందని చర్చించుకుంటున్నారు. ఎవరు అధికారంలోకి వచ్చిన స్వల్ప మెజారిటీతో నే ఉంటుందనే వారే ఎక్కువ ఉంటున్నారు. చాలామంది ఎన్నికల ఫలితాలపై అప్పుడే తుది అంచనాకు రాకపోవడంతో నే హోరాహోరి పోరు ఉంటుందని చెబుతున్నారు. వాస్తవంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ ఓటరు ఏ ఎన్నికల్లోనూ కూడా నెక్ టు నెక్‌ మెజార్టీ ఇచ్చిన నేపథ్యాలు లేవు. 


ప్రధాన పార్టీల మధ్య ప్రచారంలో హోరాహోరీ పోరు నడిచినా సీట్ల పరంగా మాత్రం ఏపీ ఓటరు వన్ సైడ్ గానే తీర్పు ఇస్తున్నారు. గ‌తంలో ఎన్టీఆర్‌, చంద్ర‌బాబు, వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి గెలిచిన సంద‌ర్భాల్లో వ‌న్‌సైడ్‌గానే తీర్పు ఇచ్చి భారీ మెజార్టీ క‌ట్ట‌బెట్టారు. అంత‌కు ముందు నేదురుమిల్లి జ‌నార్థ‌న్‌రెడ్డి, మ‌ర్రి చెన్నారెడ్డి, కోట్ల విజ‌య‌భాస్క‌ర్‌రెడ్డి సీఎంలు అయిన‌ప్పుడు కూడా ఓట‌రు కాంగ్రెస్‌కు ఏక‌ప‌క్ష తీర్పే ఇచ్చారు. ఏపీలో సంక్షీర్ణాల అవ‌స‌రం ఎప్పుడూ రాలేదు.  ఇక ఎన్నికలు ముగిసిన వెంటనే ఏపీలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేసినా అత్యల్ప‌ మెజారిటీ మాత్ర‌మే ఉంటుందని... ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీకి 90 నుంచి 100 సీట్లు లోపులోనే మెజార్టీ ఉంటుందని ఎక్కువ మంది చెబుతున్నారు.


మరికొందరు జనసేనకు సైతం కీలకమైన అవకాశం ఉందని అంటున్నారు. వాస్తవంగా చూస్తే పోలింగ్ సరళిని బట్టి చూస్తే మెజార్టీ వర్గాలు గాలి వైసీపీ వైపే ఉందని స్పష్టం చేస్తున్నాయి. అస‌లు ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల‌ను ట్ర‌యాంగిల్ ఫైట్ అన‌డం చాలా రాంగ్ అవుతుంద‌ని కూడా రాజ‌కీయ మేథావులు చెపుతున్నారు. జ‌న‌సేన పూర్తిగా చేతులు ఎత్తేసింద‌ని పోలింగ్ స‌ర‌ళే చెపుతోంది. అస‌లు ఆ పార్టీ నుంచి ఎక్క‌డ? ఎవ‌రు పోటీలో ఉన్నారో కూడా ప‌వ‌న్ అభిమానుల‌కే తెలియ‌ని ప‌రిస్థితి. ఇంకా చెప్పాలంటే ప‌వ‌న్ అభిమానులు సైతం జ‌న‌సేన‌కు ఓటేస్తే మురిగిపోతుంద‌ని డిసైడ్ అయ్యి గెలిచే పార్టీకే ఓట‌ని ఫిక్స్ అయ్యారు.


ఇక పోలింగ్ జ‌రిగిన తీరును బ‌ట్టి సీమ‌లో వైసీపీకి అనుకూలంగా వార్ వ‌న్‌సైడ్ అయ్యింది. ప్ర‌కాశం, నెల్లూరు, ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లోనూ వైసీపీ దూసుకుపోయింది. రాజ‌ధాని జిల్లాలు అయిన కృష్ణా, గుంటూరుతో పాటు విశాఖ‌లో మాత్ర‌మే టీడీపీకి ప‌రువు ద‌క్కే రేంజ్‌లో స్థానాలు రానున్నాయి. ఉత్త‌రాంధ్ర‌లోని విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళంలో ఫ్యాన్ గాలి ముందు సైకిల్ కుదేలైన‌ట్టు ప్రాథ‌మిక అంచ‌నాలు చెప్పేస్తున్నాయి. ఓవ‌రాల్‌గా చూస్తే ఏపీ ఓట‌రు తీర్పు వైసీపీకి అనుకూలంగా వ‌న్‌సైడ్‌గానే ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: