సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ఘట్టం ముగిసిన అనంతరం వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ పూర్తయిన తర్వాత రాత్రి వైఎస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. పోలింగ్‌ సందర్భంగా వైఎస్సార్ సీపీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు చనిపోయారని, వారికి పార్టీ అన్నవిధాలా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ముందుకు వచ్చి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ  జగన్ మోహన్ రెడ్డి కృతజ్ఞతలుతెలిపారు. అలాగే పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన వారందరికీ అభినందనలు చెప్పారు.

 

ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరును జగన్ తీవ్రంగా ఆక్షేపించారు. ఓటమి తప్పదని తేలిపోవడంతో చంద్రబాబు తన స్థాయిని మరిచి దిగజారి వ్యవహరించారని విమర్శించారు. చంద్రబాబు ఎన్నికల కమిషన్ ను బెదిరించడం, ఓటింగ్ శాతం తగ్గించడానికి ప్రయత్నించడం, అనేకచోట్ల అరాచకాలు, డ్రామాలు ఆడటం వంటివెన్నో చేశారని దుయ్యబట్టారు. ఇటువంటి పనులు చేసినందుకు ఆయన సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేయడానికి ముందుకు రావడం హర్షించదగ్గ విషయమని, ఇది ప్రజల విజయమని అన్నారు. చంద్రబాబు చేసిన కుట్రలు, కుయుక్తులు, డ్రామాలు అన్నింటిని దాటుకున్ని ఓటు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.


 

ఎన్నికల్లో అక్కడక్కడ సమస్యలు రావడానికి రాక్షసుడిగా ఉన్న చంద్రబాబు కారణమని, ఆయన ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పటికీ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నారని జగన్ అన్నారు. డ్వాక్రా మహిళలు, రైతులను చంద్రబాబు మోసం చేశారని, అలా మోసం చేసిన వారిని ప్రజలు మరిచిపోరని వ్యాఖ్యానించారు. రిటర్న్ గిఫ్ట్ ల వ్యవహారం చంద్రబాబు, కేసీఆర్ ల మధ్య సాగిందని, అందులో తమకెలాంటి సంబంధం లేదన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


కాగా జగన్ వ్యాఖ్యలతో ఇప్పుడు చంద్రబాబు మళ్లీ రిటర్న్ గిఫ్ట్ గురించి ఆలోచించే పరిస్థితి ఎదురైందని అంటున్నారు. తను తెలంగాణ ఎన్నికల్లో తలదూర్చిన ఎపిసోడ్ వల్ల ఎదురైన ఈ  పరిణామం గురించి చంద్రబాబు ఇప్పటికే పలు సందర్భాల్లో ఆవేదనతో స్పందించిన సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: