ఓటింగ్ శాతం పెరిగితే అది ప్రభుత్వ ఓటు బ్యాంకు అని చాలా మంది చెబుతుంటారు. అయితే ఈ సారి ఆంధ్రప్రదేశ్ లో ఓ రేంజ్ లో ఓటింగ్ శాతం పెరిగింది. సుమారు 74% గా ఓటింగ్ శాతం నమోదు అయ్యింది. దీనితో ఇదిజగన్ ఆనందంతో ఉన్నాడు. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ శాతం భారీ ఎత్తున పెరిగిన వైనాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. పెరిగిన పోలింగ్ చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనంగా ఆయన చెప్పుకొచ్చారు. ప్రజలను మభ్యపెట్టి మాయ చేసిన చంద్రబాబును నమ్మని ప్రజలు.. చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారని కూడా జగన్ వ్యాఖ్యానించారు.


ఈ సందర్భంగా జగన్ ఏమన్నారన్న విషయానికి వస్తే... తన ఓటమి తప్పదన్న విషయం తెలుసుకున్న మీదట చంద్రబాబు తన స్థాయిని మరిచి దిగజారి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ ను బెదిరించడం ఓటింగ్ శాతాన్ని తగ్గించేందుకు యత్నించడం అనేక చోట్ల అరాచకాలు డ్రామాలు ఆడటం చూస్తుంటే... చంద్రబాబు తన ఓటమిని ఒప్పేసుకున్నట్టేనని జగన్ వ్యాఖ్యానించారు. ఈ తరహా పనులు చేసినందుకు చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలని కూడా జగన్ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ఓటు వేయడానికి రావడం హర్షించదగ్గ విషయమని కూడా జగన్ వ్యాఖ్యానించారు. పోలింగ్ శాతం పెరగడాన్ని ఆయన ప్రజల విజయంగా అభివర్ణించారు.


 ఎన్ని అవాంతరాలు వచ్చినా ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడ్డ పార్టీ నేతలు కార్యకర్తలకు జగన్ అభినందనలు తెలిపారు. పోలింగ్ లో భాగంగా అనంతపురం చిత్తూరు జిల్లాల్లో జరిగిన ఘర్షణల్లో ఇద్దరు పార్టీ కార్యకర్తలు చనిపోయారని ప్రస్తావించిన జగన్... వారి కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని ప్రకటించారు. పలు నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులపై ప్రత్యర్థులు దాడికి తగబడ్డారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో మంగళగిరి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన నారా లోకేశ్ యథేచ్ఛగా కోడ్ ను ఉల్లంఘించారని జగన్ ఆరోపించారు. ఎన్నికల్లో అక్కడక్కడ సమస్యలు రావడానికి రాక్షసుడిగా ఉన్న చంద్రబాబే కారణమని కూడా జగన్ ఆరోపించారు. డ్వాక్రా మహిళలను రైతులను చంద్రబాబు మోసం చేశారని ఇలాంటి మోసగాళ్లను ప్రజలు ఉపేక్షించరని కూడా జగన్ చెప్పుకొచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: