పోలింగ్ ముగిసిన వెంటనే అంచనాలు మొదలయ్యాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారమైతే 80 శాతం పోలింగ్ అయ్యిందంటున్నారు. అయితే అది కరెక్టు కాకపోవచ్చు. ఎందుకంటే, గురువారం అర్ధరాత్రి వరకూ పోలింగ్  జరుగుతునే ఉంది. పైగా రీపోలింగ్ కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  కాబట్టి పోలింగ్ శాతం ఎంతన్నది ఇక్కడ అప్రస్తుతం.

 

జరిగిన పోలింగ్ ను గమనించిన చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి బాగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓట్లేసిన వాళ్ళల్లో  మహిళలు, వృద్ధులు ఎక్కువ సంఖ్యలో కనిపించారు. కాబట్టి వాళ్ళ ఓట్లన్నీ తమకంటే తమకే అనే అంచనాలు వేసుకుంటున్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుతీరుతో మహిళలు, వృద్ధులు తమకే ఓట్లేశారంటూ చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబుపై వ్యతిరేకత వల్లే పై ఓటర్లు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని వైసిపికి ఓట్లేసినట్లు జగన్ అంచనా వేసుకుంటున్నారు.

 

పసుపు కుంకుమ, వృద్ధాప్య ఫించన్లు అందుకున్న పేద తరగుతల ఓటర్లంతా తమకే అండగా నిలబడ్డారన్నది టిడిపి అంచనా. దాదాపు 90 లక్షల మంది డ్వాక్రా సంఘాల మహిళలే టిడిపి ఆదుకున్నారని టిడిపి నేతలు లెక్కలేసుకుంటున్నారు. కాబట్టే తమకు 130 సీట్లు ఖాయమని కూడా అనుకుంటున్నారు. మహిళలు, వృద్ధుల్లో టిడిపికి ఓట్లేయాలన్న తపన కన్పించిందని కాబట్టే చంద్రబాబుకు మద్దతుగా నిలబడ్డారనే ధియరీని ప్రచారం చేస్తున్నారు.

 

డ్వాక్రా మహిళల్లో కొందరికి డబ్బులు వచ్చిన మాట వాస్తవమే అయినా చాలామందికి రాలేదని వైసిపి నేతలంటున్నారు. సరిగ్గా పోలింగ్ కు ముందు పసుపు కుంకుమ పేరుతో సెంటిమెంటు పండించేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నం బెడిసికొట్టిందని వైసిపి నేతలు అంచనాలు వేస్తున్నారు. చంద్రబాబు మీద కోపంతో ఉన్న మహిళలు, వృద్ధులంతా దివంగత సిఎం  వైఎస్ రుణాన్ని తీర్చుకునేందుకు వైసిపికి వేసినట్లు లెక్కలు కడుతున్నారు.

 

మొత్తం మీద పోలింగ్ కేంద్రాల దగ్గర పోటెత్తిన మహిళలు, వృద్ధుల ఓట్లు ఎవరికి పడిందనే విషయంలో మాత్రం సస్పెన్స్ మొదలైంది. పోలింగ్ శాతం పూర్తి లెక్కలు రావాలి, రీపోలింగ్ విషయం తేలితే కానీ సస్పెన్స్ కు తెరపడేట్లు కనబడటం లేదు. ఒకవేళ రీపోలింగ్ జరిగే అప్పుడు పడే ఓట్లు ఎవరికి పడుతున్నాయనే విషయంలో ఓ క్లారిటీ రావచ్చు.  దాన్నిబట్టి తాజా ఓటింగ్ లో ఎవరికి మొగ్గుందనే విషయంలో లెక్కలె కట్టొచ్చు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: