ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాకిస్థాన్​లోని  పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ చేసిన కామెంట్లపై ఆయన మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే.. భారత్-పాక్ మధ్య శాంతి చర్చలకు మెరుగైన అవకాశాలు ఉంటాయని, కశ్మీర్ సమస్యకు ఏదో ఒక పరిష్కారం లభిస్తుందని కొద్దిమంది విదేశీ జర్నలిస్టులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.


దీనిపై ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. భారత్ ఎన్నికల ప్రక్రియపై జోక్యం చేసుకునే హక్కు పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు లేదని ఆయన తెలిపారు. భారత్ వంటి గొప్ప దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియపై పాకిస్తాన్‌కు జోక్యం చేసుకునే హక్కు ఆయనకు ఎక్కడిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలను చూస్తే మోదీతో ఇమ్రాన్‌ఖాన్ కలిసిపోయినట్టు ఉందని ఓవైసీ ఆరోపించారు. ఇమ్రాన్‌ఖాన్ కలలను నిజం కానీయరాదని అభిప్రాయపడ్డారు. ఇప్పటి పరిస్థితుల్లో మోదీకి ఓటు వేస్తే పాకిస్తాన్‌కు వేసినట్టేనని ఓవైసీ వ్యాఖ్యానించారు.


కాగా, పాక్ ప్రధాని ఇమ్రా న్ ఖాన్ వ్యాఖ్యలపై విపక్షాలు మండి పడ్డాయి. మోదీకి మొదట పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై ప్రేమ ఉండేదని, ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఆయన ఆప్తమిత్రుడయ్యాడని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుర్జేవాలా ఎద్దేవా చేశారు. పిలవకుండానే పాక్‌కు వెళ్లే ఏకైక ప్రధాని ఇతనే (మోదీ) అంటూ సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విరుచుకుపడ్డారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. మోదీ గెలిస్తే, పాకిస్థాన్‌లో టపాసులు పేలుతాయని విమర్శించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: