ఆంధ్రప్రదేశ్ లో ఓటింగ్ శాతం సుమారుగా 80 శాతం నమోదు అయ్యింది. దీనితో భారీ ఓటింగ్ నమోదు ఏ పార్టీకి నష్టము చేకుర్చబోతుందని ఇప్పటికే చాలా విశ్లేషణలు సాగుతున్నాయి. ఈవీఎంల మొరాయింపు వాస్తవం. అర్థరాత్రి వరకు పోలింగ్‌ జరిగిందంటే ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్‌ వైఫల్యం సుస్పష్టం. అయినాగానీ, 80 శాతం పైగా పోలింగ్‌ నమోదవడమంటే, ఓటరు 'కసిగా' ఓటేశారన్న విషయం స్పష్టంగా కన్పిస్తోందిక్కడ. ఆ 'కసి' ఎవరి మీద ఓటర్‌ చూపించారన్నదే ఇక్కడ ప్రశ్న.


తెలంగాణలో రికార్డు స్థాయి పోలింగ్‌ అధికార పార్టీకి కలిసొచ్చింది గనుక, ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే రిపీట్‌ అవుతుందని టీడీపీ నేతలు పైకి చెబుతున్నా, వారి మాటల్లో 'కాన్ఫిడెన్స్‌' అనేది కన్పించడంలేదు. మరోపక్క, టీడీపీ - వైసీపీలకు ప్రత్యామ్నాయం తామేనని గొంతు చించుకున్న జనసేన పార్టీ, పోలింగ్‌ తర్వాత సైలెంటయిపోయింది. 'చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు సాధిస్తాం..' అని చెబుతున్న ఆ పార్టీ నేతలు సీట్ల విషయం గురించి మాట్లాడలేని పరిస్థితి నెలకొందిప్పుడు. కాంగ్రెస్‌, బీజేపీల గురించి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఇప్పుడు మాట్లాడుకోవడానికేమీ లేదు. మామూలుగా అయితే, అధికార పార్టీ ఎన్నికల వేళ వ్యవహరించే తీరుకి భిన్నంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరించింది.


ప్రతిపక్షాలు ఆందోళన చేయాల్సింది పోయి, అధికార పక్షమే రచ్చకెక్కింది. నానా యాగీ చేశారు అధికార పార్టీ నేతలు. నారా లోకేష్‌ అయితే 'నేను ముఖ్యమంత్రి కొడుకుని.. క్యాబినెట్‌ మంత్రిని..' అంటూ రెచ్చిపోవడం గమనార్హం. ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక ఇంకా తనకు ఆ 'పదవి' వుంది అనే భ్రమలో నారాలోకేష్‌ వుండడం హాస్యాస్పదమే. మొత్తంగా చూస్తే, ఓటరు చాలా కసిగా ఓటేశాడు. ఈ కసి ఖచ్చితంగా అధికార పార్టీకి వ్యతిరేకంగానేనన్న భావన రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: