జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ?ఏపీకి సీఎం అవుతానని ప్రకటించిన జనసేనాని జాడేది? ఇది ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న హాట్ చర్చ. ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ముగిసిన అనంతరం ఆయా పార్టీలు తమ తమ అభిప్రాయాలు వినిపించగా, జనసేనాని మాత్రం మీడియాకు దూరంగా ఉన్నారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయకపోవడం చర్చకు దారితీస్తోంది.


ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటుగా, కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు ఎన్నికలు జరిగిన తీరుపై తమ అభిప్రాయాన్ని తెలిపాయి. గెలుపుపై ధీమా వ్యక్తం చేశాయి. అయితే, ప్రధాన పార్టీ, అవకాశం వస్తే….అధికారం చేజిక్కించుకోవడమే ఆలస్యమన్నట్లుగా వ్యవహరించిన జనసేన పార్టీ తరఫు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఎన్నికలు జరిగిన తీరు గురించి కానీ…తమ పార్టీ గెలుపు ఓటముల గురించి కానీ….జనసేనాని స్పందించకపోవడం గమనార్హం.


మరోవైపు, ఏపీలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గడిపిన పవన్  ఈ  సందర్భంగా రేడియో వింటున్నప్పటికీ కొన్ని ఫోటోలను మాత్రమే విడుదల చేశారే తప్పించి...మీడియాతో మాట్లాడలేదు. కాగా, ఏపీలో కీలక పార్టీగా జనసేన అవతరించబోతోందని, పెద్ద ఎత్తున సీట్లలో జనసేన గెలువనుందనే అంచనాలు కొందరు వేసినప్పటికీ...పోలింగ్ సమయంలో అలాంటి దోరణి కనిపించలేదని చర్చ జరుగుతోంది. చెప్పుకోదగిన స్థానాల్లోనూ జనసేనగెలుస్తుందా? అనే చర్చ సైతం తెరమీదకు వస్తోంది. పవన్ మీడియాకు దూరంగా ఉండటం సైతం దీనికి ఆజ్యం పోస్తోంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: