విచిత్రంగా ఉంది టిడిపి నేతల పరిస్ధితి.  స్పీకర్ కోడెల శివప్రసాద్ కు ఇపుడు ప్రజాస్వామ్యం గుర్తుకొస్తోంది. అదికూడా జనాల చేతిల్లో చావు దెబ్బలు తిన్న తర్వాత. పోలీసులు, ప్రజాస్వామ్యం, న్యాయం లాంటి వాటి గురించి కోడెల మాట్లాడుతుండటమే విచిత్రంగా ఉంది. 30 శాతం ఈవిఎంలు పని చేయలేదని చంద్రబాబు ఆరోపించిన విషయం తెలిసిందే. చంద్రబాబు చెప్పిన తర్వాత తాను కూడా మాట్లాడకపోతే బావోదనుకున్నారో ఏమో ? కోడెల ఏకంగా 50 శాతం ఈవిఎంలు పనిచేయలేదన్నారు. వాళ్ళు చెప్పినట్లుగా ఈవిఎంలు పనిచేయకపోతే 81 శాతం పోలింగ్ ఎలా జరిగింది ?

 

సత్తెనపల్లిలోని ఓ పోలింగ్ కేంద్రానికి  వెళ్ళినపుడు కోడెలపై దాడి జరిగింది వాస్తవం. అలా దాడి జరగటాన్ని ఎవరు సమర్ధించటం లేదు. అయితే భద్రత ఉన్న కోడెలపైనే జనాలు దాడి  చేశారంటే వాళ్ళల్లో ఎంతగా ఏహ్యభావం పేరుకుపోయింది ? ఐదేళ్ళ పాటు ప్రజాస్వామ్యాన్ని, విలువలను కాలరాచి సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.

 

ఒకవైపు కొడుకు మరోవైపు కూతురు తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచేశారనే ఆరోపణలు ఎంతున్నాయో అందరికీ తెలిసిందే. వీళ్ళ అరాచకాలు, దోపిడి, అవినీతి ఏ స్ధాయికి వెళ్ళిందంటే టిడిపి నేతలే భరించలేకపోయేంతగ. కొడుకు శివరమాకృష్ణ అవినీతి, ధౌర్జన్యాలైతే ఏకంగా కేంద్ర రైల్వేశాఖ మంత్రి దృష్టికే వెళ్ళిందంటే ఏమిటర్ధం ?

 

ఇక, ఫిరాయింపు ఎంఎల్ఏలపై వేటు వేసే విషయంలో కోడెల పాటించిన ప్రజాస్వామ్యపు విలువల గురించి అందరికీ తెలిసిందే.  జగన్ అండ్ కో ను అసెంబ్లీ వేదికగా అమ్మనాబూతులు తిట్టించి వికృతానందం పొందిన విషయం అందరూ చూసిందే. నిబంధనలకు విరుద్ధంగా రోజాను ఏడాదిపాటు అసెంబ్లీ నుండి సస్పెండ్ చేసిన విషయం అందరూ చూసిందే.  ఈ విషయంలో కోర్టు జోక్యాన్ని కూడా కోడెల పట్టించుకోలేదు.

 

ఐదేళ్ళ అరాచకాలకు భయపడిపోయిన టిడిపి నేతలే కోడెలకు టికెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేశారంటే పరిస్ధితి ఏంటో అర్ధమైపోతోంది. తమ డిమాండ్ ను కాదని టికెట్ ఇస్తే కచ్చితంగా ఓడగొడతామని ఏకంగా చంద్రబాబుకే అల్టిమేటమ్ ఇచ్చారు. కోడెలకు వ్యతిరేకంగా రెండు నియోజకవర్గాల్లోను భారీ నిరసన కార్యక్రమాలే చేపట్టారంటే కోడెల పై ఏ స్ధాయిలో జనాలు మండిపోతున్నారో అర్ధమైపోతోంది. ఐదేళ్ళల్లో నానా అరచకాలకు తెరలేపిన కోడెల ఇపుడు నీతులు మాట్లాడుతుండటమే విచిత్రంగా ఉంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: