ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మొన్న జరిగిన ఎన్నికల్లో ఓటర్లు సామాజికవర్గాలుగా చీలిపోయింది వాస్తవం. అందులోను రెండు కులాల మధ్య ఆధిపత్య పోరాటంగా మారిపోయింది. రాష్ట్రంలోని కమ్మోరంతా చంద్రబాబుకు మద్దతుగా మోహరించారు. రెడ్డోర్లందరూ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలబడ్డారు. విచిత్రం ఏమిటంటే మొత్తం జనాభాలో ఇటు కమ్మలైనా అటు రెడ్లైనా జనాభా రీత్యా తీసుకుంటే మైనారిటీలే.

 

సరే సామాజికవర్గాల గొడవలను పక్కనపెడితే రేపు చంద్రబాబు మళ్ళీ సిఎం అయ్యారని అనుకున్నా, జగన్ అధికారంలోకి వస్తున్నాడని అనుకున్నా ప్రధాన కారణం మాత్రం అమ్మోర్లే అని టిడిపి ఎంపి జేసి దివాకర్ రెడ్డంటున్నారు. వినటానికి  జేసి వాదన విచిత్రంగా ఉన్నా కాస్త అందులో లాజిక్ కూడా ఉందిలేండి. ఇంతకీ జేసి చెప్పిన లాజిక్ ఏమిటంటే రాష్ట్రంలో రెడ్లందరూ జగన్ కు మద్దతుగా నిలబడ్డారని ఈయన కూడా చెప్పారు. నిజానికి సమాజం సామాజికవర్గాల వారీగా చీలిపోవటం మంచిది కాదని కూడా ఈయన బోల్డు బాధపడిపోయారు. అయితే కమ్మోర్ల ఆధిపత్యం బాగా పెరిగిపోయిందని మిగిలిన సామాజికవర్గాలు మండిపోతున్నాయి.

 

అదే సమయంలో రాబోయేది అధికారంలోకి మళ్ళీ టిడిపినే అని జోస్యం కూడా చెప్పారు. ఎలాగంటే రాష్ట్రంలోని అమ్మోర్లంతా (డ్వాక్రా మహిళలు) చంద్రబాబును పెద్దన్నగా చూసుకున్నారట. అందుకనే వాళ్ళ ఓట్లన్నీ తమకే పడ్డాయని జేసి అంచనా వేస్తున్నారు. అమ్మోర్ల ఓట్లన్నీ టిడిపికే ఎలా పడ్డాయని అనుకున్నారు ? ఎలాగంటే ఉదయమే పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లలో ఎక్కువగా మహిళలే ఉన్నారట.

 

అయితే ఈవిఎంలు మొరాయించటంతో చాలామంది వెనక్కు తిరిగి వెళ్ళిపోయారట.  అయితే మధ్యాహ్నంపైన వెనక్కు వెళ్ళిపోయిన వారంతా వచ్చి ఓట్లు వేయండని చంద్రబాబు ఇచ్చిన పిలుపందుకుని మళ్ళీ అమ్మోర్లంతా పోలోమంటూ వచ్చి ఓటింగ్ లో పాల్గొన్నారట. దానివల్లే ఓటింగ్ శాతం పెరిగిపోయిందని జేసి అంటున్నారు. పసుపు కుంకుమ అందుకున్న చంద్రన్న చెల్లెమ్మల్లంతా టిడిపికే ఓట్లేశారని అంటున్నారు. కాబట్టే తమ గెలుపు ఖాయమన్న ధీమాతో ఉన్నారు ఎంపిగారు.

 

సరే జేసి అంచనాలను పక్కనపెడితే అత్యధికంగా పోలింగ్ శాతాన్ని నమోదు చేసుకున్న నియోజకవర్గాల్లో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలున్నవే. అటువంటి నియోజకవర్గాల్లో పోలింగ్ సగటు 80 శాతంగా నమోదైంది.  పాదయాత్రలో జగన్ కు  బ్రహ్మరథం పట్టిన నియోజకవర్గాలే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టే చంద్రబాబు మీద వ్యతిరేకతతోనే లేడీస్ ఓట్లన్నీ తమకే పడ్డాయన్న వైసిపి నేతల వాదనను కూడా కొట్టేసేందుకు లేదు. మొత్తానికి అమ్మోర్ల  మద్దతు రెడ్డోర్లకా ? లేకపోతే కమ్మోర్లకా ?

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: