వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్‌ కిషోర్‌ & టీంతో ఆ పార్టీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం రాత్రి సమావేశం అయ్యారు. వైసీపీ తరపున గత ఏడాదిన్నర కాలంగా విస్తృతంగా పని చేసిన ప్రశాంత్‌ కిషోర్‌ & టీంకు వైఎస్‌ జగన్‌ కృతజ్ఞతలు తెలియచేశారు. అనంతరం జగన్‌ పోలింగ్‌ జరిగిన సరళిని బట్టి వైసీపీ గెలిచే నియోజకవర్గాలు, ఏ ఏ నియోజకవర్గాల్లో పోటీ ఎలా ? ఉంది వైసీపీ అనుకూలతలేంటి అనే అంశాలపై ప్రశాంత్‌ కిషోర్‌తో చర్చించారు. ఆ తర్వాత ఐ ప్యాక్‌ సిబ్బందితో జగన్‌ సమావేశం అయ్యారు. ఎన్నికల సమయంలో ఐ ప్యాక్‌ సంస్థ పోలింగ్‌ ట్రెండును పరిశీలించింది. పోలింగ్‌ సరళి చూశాక గ్రామీణ ఓటరు, యువత, మెజారిటీ సామాజికవర్గాలు వైసీపీ వైపు ఉన్నట్టు స్పష్టంగా తేటతెల్లం అయ్యింది. తెలుగుదేశం పార్టీ తమకు తిరుగులేని అస్త్రంగా ఉపయోగపడుతుందని భావించిన పసుపు-కుంకుమ కూడా ఓటర్లపై పెద్దగా ప్రభావం చూపించే అవకాశం లేదని వీరి లెక్కల్లో తేలిపోయింది.


దీనికి అనేక రకాల కారణాలు కూడా వారు విశ్లేషిస్తున్నారు. చాలా చోట్ల పసుపు-కుంకుమ కింద బ్యాంక్ అకౌంట్లలో జమ అయిన మొత్తాలను పాత రుణాల కింద సర్దుబాటు చేసుకోవడంతో వారంతా నిరాశకు గురయ్యారు. కొన్ని చోట్ల ఎన్నికల రోజు నాటికి నగదు చేతికి అందకపోవడం, అందరికి ఈ మొత్తాలు రాకపోవడం లాంటి మైనెస్‌లతో పసుసు-కుంకుమ ప్రభావం ఓటింగ్‌లో పెద్దగా లేదని ఐ ప్యాక్‌ అంచనాలో తేలింది. పసుపు-కుంకుమ ప్రభావాన్ని మదింపు చేసిన తర్వాత కూడా వైసీపీకి మొత్తం 117 సీట్లు వస్తాయని ఐప్యాక్‌ అంచనా వేసినట్టు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరో వైపు పోలింగ్‌ సరళి తాము అనుకున్నంత అనుకూలంగా లేకపోవడంతో అధికార టీడీపీ ఈవీఎంల‌లో గోల్‌మాల్‌, మోసాలంటూ గగ్గోలు పెడుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో జగన్‌ మాత్రం పూర్తి ధీమాతో మౌనంగానే ఉన్నారు. ఏ కోణంలో చూసుకున్నా వైసీపీకి ఓవర్‌ఆల్‌గా 110కి పైనే సీట్లు వస్తాయని ఆ పార్టీ వర్గాలు గట్టి ధీమాతో ఉన్నాయి. 


ఇటు వైసీపీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్రశాంత్‌ కిషోర్‌ సైతం జగన్‌కు అభినందనలు తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమాతో ఉన్న వైసీపీ సీనియర్లలో చాలా మంది మంత్రి పదవులపై అప్పుడే ఆశలు పెంచేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఏకంగా తమకు 150 సీట్లు వస్తాయని చెప్పడం విచిత్రం. వాస్తవంగా చూస్తే పోలింగ్‌ సరళి టీడీపీకి అనుకూలంగా లేకపోయినా ఆ పార్టీ చివరి నిమిషంలో తీసుకువచ్చిన పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ, ఫెన్షన్ల పెంపుపైనే ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇవే తమను గెలిపిస్తాయని ధీమాతో ఉంది. అయితే చంద్రబాబు చెప్పిన 130 సీట్ల లెక్కతో పాటు ఆ పార్టీ ఆశలు పెట్టుకున్న పథకాలపై టీడీపీ నేతల్లో కూడా సందేహాలు ఉన్నాయి. మరి ఫైన‌ల్‌గా చంద్రబాబు చెప్పిన 130 సీట్ల లెక్క నిజమవుతుందా ? లేక ప్రశాంత్‌ కిషోర్‌ చెప్పిన 117 సీట్ల లెక్క పక్కా అవుతుందా ? అన్నది తెలియాలంటే మే 23 వరకు వేచి చూడాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: