ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీరుపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోమారు మండిపడ్డారు. తెలంగాణ, ఏపీలో పోలింగ్​ ముగిసిన నేపథ్యంలో తలసాని మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తీరును ఎద్దేవా చేశారు. ఏపీ సీఎం చంద్రబాబులో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు ఏపీలో జరిగిన ఎన్నికల్లో చిల్లర వ్యక్తుల కన్నా అధ్వాన్నంగా చంద్రబాబు వ్యవహారం ఉందన్న ఆయన.. ఒక ముఖ్యమంత్రి ప్రజలకు ఏం చేశామో చెప్పి ఓట్లు అడగాలి.. కానీ, కేసీఆర్ తిట్టడమేంటి అని ఫైర్ అయ్యారు. చంద్రబాబు... ఎన్టీఆర్‌ను మర్చిపోయారేమో గానీ, నిద్రలో కూడా కేసీఆర్ ను కలవరిస్తున్నారని ఎద్దేవా చేశారు. 

 

ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకి ఓటమి భయం పట్టుకుందని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఏపీలో పోలింగ్ శాతం బాగుందన్నారు. పోలింగ్‌పై టీడీపీ డ్రామాలాడుతోందన్నారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత పబ్లిసిటీ కోసమే చంద్రబాబు ఈసీని కలిశారన్నారు. ఏపీ ఎన్నికల్లో దాదాపు 42 వేల ఈవీఎంలు వాడితే అందులో 300 ఈవీఎంలలోనే సమస్యలు తలెత్తాయి. ఆ 300 ఈవీఎంలపైనే టీడీపీ ఆధారపడి ఉందా? అని మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబువి చిల్లర రాజకీయాలన్నారు. నోరు తెరిస్తే అన్ని అబద్దాలేనన్నారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని దుయ్యబట్టారు. ఆయనపై కేసులు లేవా? స్టేలు తెచ్చుకోలేదా? అన్నారు. తన అసమర్థ పాలనను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు చేయాల్సిన కుట్రలన్నీ చేశారన్నారు. ఓట్ల కోసం ఏపీ, తెలంగాణ ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని చంద్రబాబు ప్రయత్నం చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.

 

సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు బలపరుస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అన్నారు. ఓటు వేసిన ప్రజలకు, కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలన్నారు. రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలను టీఆర్‌ఎస్ గెలవబోతుందన్నారు. గులాబీ పార్టీ అంటే ఇంటి పార్టీగా ప్రజలు భావిస్తున్నారన్నారు. కేసీఆర్​ ఢిల్లీలో కీలక శక్తిగా ఎదగడం ఖాయమన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: