ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ జేబు సంస్థగా ముద్రపడి ఐటీ గ్రిడ్స్ సంస్థ బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి 7.82 కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని అక్రమమార్గంలో సేకరించింది. ఈ సమాచారం ఆధార్ సంస్థ వద్ద ఉన్న సమాచారం ఒకటేనని దర్యాప్తులో తేలింది. ఐటీ గ్రిడ్స్ సంస్థ.. అడ్డదారిలో ఆధార్ సంస్థలోని సీఐడీఆర్ ( సెంట్రల్ ఐడెంటిటీస్ డాటా రిపోసిటరీ) లేదా ఎస్‌ఆర్డీహెచ్ (స్టేట్ రెసిడెంట్ డాటా హబ్) లింక్‌లోకి ప్రవేశించి సమాచార చౌర్యానికి పాల్పడిందని ఆధార్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ టీ భవానీ మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదుతో స్పష్టమైంది.

 

మాదాపూర్‌లోని ఐటీ గ్రిడ్స్ సంస్థ తప్పుడు మార్గంలో ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి వాటిని టీడీపీకి చెందిన సేవామిత్ర అప్లికేషన్ ద్వారా ఓటర్లను ప్రలోభపెట్టడం, తమకు అనుకూలంగా లేనివారి ఓట్లను తొలిగించి టార్గెట్ చేస్తున్నారని హైదరాబాద్ కేపీహెచ్‌బీ ప్రాంతానికి చెందిన లోకేశ్వర్‌రెడ్డి గతనెల 2న మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదుచేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వ ఆదేశాలతో దర్యాప్తు ప్రారంభించిన సిట్.. ఐటీగ్రిడ్స్ సంస్థలో సోదాలు జరిపి ఏడు హార్డ్‌డిస్క్‌ లతోపాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నది. అనంతరం వాటిని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపింది. వీటిని పరిశీలించిన టీఎఫ్‌ఎస్‌ఎల్ అధికారులు.. ఇందులో ప్రాథమికంగా ఆధార్‌కు సంబంధించిన అంశాలు ఉన్నాయని, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన 7,82,21,397 మంది వ్యక్తిగత సమాచారం హార్డ్‌డిస్క్‌లలో ఉన్నట్టు తేల్చారు. ఈ సమాచారాన్ని ఐటీ గ్రిడ్స్‌ సంస్థ.. టీడీపీ నిర్వహిస్తున్న సేవామిత్ర అప్లికేషన్‌కు అనుసంధానం చేసిందని తెలిసింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వద్ద ఉండాల్సిన సమాచారం ఈ సంస్థకు చేరినట్టు స్పష్టమైంది.

దర్యాప్తులో భాగంగా ఫిర్యాదుదారుడు లోకేశ్వర్‌రెడ్డి ఇచ్చిన సమాచారంలోని ముద్దనలాలిగారి జయమోహన్‌రెడ్డి, అక్కల మాదిలేటిరెడ్డి, ఆకుల రవికుమార్, అబ్దాస్ వెంకటప్రతాప్, లోకేశ్వర్‌రెడ్డి ఆధార్ నంబర్లను ఐటీ గ్రిడ్స్ సంస్థలో హార్డ్‌డిస్క్‌లలో ఉన్న డాటాతో పోల్చి చూడగా, అదంతా ఆధార్‌కార్డులో నమోదుచేసిన సమాచారమేనని స్పష్టమైంది. ఐటీగ్రిడ్స్ సంస్థ దగ్గర ఉన్న సమాచారం.. ఆధార్‌తో సంబంధం ఉన్న సీఐడీఆర్ లేదా ఎస్‌ఆర్డీహెచ్ నుంచి అక్రమంగా పొందారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిట్ అధికారులు చేపట్టిన దర్యాప్తులో వెలుగుచూసిన అంశాలపై ఆధార్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ శుక్రవారం ఫిర్యాదు చేయడంతో మాదాపూర్ పోలీసులు సెక్షన్ 37, 38-ఏ, 38-బీ, 38-జీ, 40, 42, 44-ఏఏల కింద ఐటీగ్రిడ్స్ సంస్థపై కేసులు నమోదుచేశారు. ఈ కేసును కూడా సిట్ దర్యాప్తు చేస్తుందని మాదాపూర్ పోలీసులు తెలిపారు.  కాగా ఐటీ గ్రిడ్స్​ యొక్క లీలలు రాబోయే కాలంలో ఇంకెన్ని బయటపడతాయో మరి!


మరింత సమాచారం తెలుసుకోండి: