వారణాసి.... ప్రధాని మోదీ సిట్టింగ్ స్థానం. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి దేశం దృష్టిని మరోమారు ఆకర్షిస్తున్నది. నరేంద్రమోదీపై పోటీ చేయడం ద్వారా యావత్ దేశం దృష్టిని ఆకర్షించేందుకు కొందరు సిద్ధపడుతుండగా.. మరికొందరు తమ సిద్ధాంతాల్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు వారణాసిని వేదికగా మలుచుకుంటున్నారు. ఇందులో అన్నివర్గాలకు చెందిన వారున్నారు.

తమిళనాడు నుంచి 111 మంది రైతులు వారణాసి నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. 2017లో ఢిల్లీ కేంద్రంగా ఆందోళనలకు దిగి దేశం దృష్టిని ఆకర్షించిన తమిళనాడు రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం వారణాసిలో పోటీ బాటను ఎంచుకున్నారు. మరోవైపు, తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో తీవ్రంగా ఉన్న ఫ్లోరైడ్ సమస్యను దేశం యావత్తూ తెలిసేలా చేసేందుకు ఫ్లోరైడ్ బాధితుల తరఫున అన్సుల స్వామి వారణాసి నుంచి మోదీపై పోటీ చేస్తున్నాడు. మోదీపై పోటీ చేసి గెలువలేమని తెలిసినప్పటికీ.. ఇక్కడి నుంచి పోటీ చేయడం ద్వారా తమ సందేశాన్ని వినిపించవచ్చునని వారు భావిస్తున్నారు.

ఇక కోర్టు ధిక్కరణకు గురై ఆరు నెలల జైలుశిక్ష అనుభవించిన కోల్‌కతా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సీఎస్ కర్ణన్.. గత ఏడాది తాను స్వయంగా స్థాపించిన యాంటీ కరప్షన్ డైనమిక్ పార్టీ అభ్యర్థిగా లక్నో నుంచి బరిలో నిలిచారు. మోదీపై పోటీ చేయడం ద్వారా అవినీతికి వ్యతిరేకంగా తాను చేస్తున్న పోరాటానికి ప్రచారం లభిస్తుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఇక్కడి నుంచే బీఎస్‌ఎఫ్ మాజీ జవాన్ తేజ్‌బహదూర్ యాదవ్ కూడా పోటీ చేస్తున్నారు. సరిహద్దుల్లో విధుల్లో ఉన్న జవాన్లకు సరఫరా చేస్తున్న ఆహారం నాసిరకంగా ఉంటుందంటూ 2017లో ఫేస్‌బుక్‌లో వీడియోలు పోస్ట్ చేసి తేజ్‌బహదూర్‌యాదవ్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనను ఉన్నతాధికారులు ఉద్యోగం నుంచి క్రమశిక్షణారాహిత్యం పేరుతో తొలిగించారు. జవాన్ల పేరిట మోదీ ఓట్లు దండుకొంటున్న తీరును ప్రజలకు వివరించేందుకు వారణాసిని ఎంచుకున్నట్టు తేజ్‌బహదూర్ పేర్కొన్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: