ఏపీలో గత ఏడాదిగా నువ్వా నేనా అన్న వాతావరణం ఉంది. చంద్రబాబు అయితే ధర్మ పోరాట దీక్షలతో ఏడాది క్రితమే ప్రచరాం మొదలెట్టారు. ఇక జగన్ విషయం చూస్తే రెండేళ్ల క్రితం  పాదయాత్ర చేపట్టి గడప గడపను తట్టి లేపారు. ఓ విధంగా చావో రేవో అన్నట్లుగా ఈసారి ఎన్నికలు జరిగాయన్నది వాస్తవం.

 

ఇక ఏపీలో ఈసారి భారీ పోలింగ్ జరిగింది. దాదాపుగా ఎనభై శాతానికి పోలింగ్ చేరుకుంది. మరి ఈ పెరిగిన పోలింగ్ ఎవరికి మేలు అవుతుందని అంచనా వెసినపుడు  కొన్ని విషయాలని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఏపీలో చూసుకుంటే 1983, 1985, 1994, 2004 సమయాల్లో పెద్ద ఎత్తున ప్రభంజనం వీచింది. నాడు జనం స్వచ్చందంగా స్పందించి ఓటింగుకు వచ్చారు. వారిని అంతలా కదిలించిన సంఘట నలు ఆయా పోలింగుకు ముందు చోటు చేసుకున్నాయి.

 

1983లో కాంగ్రెస్ పాలనతో విసిగిన జనానికి సినీ దైవం అన్న గారు రాజకీయాల్లొకి రావడం పార్టీ పెట్టడం అతి పెద్ద సంచలనంగా ఉంది. ఇక 1985 మధ్యంతర ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం వీచడం వెనక నాదెండ్ల వెన్నుపోటు ఉదంతం ఉంది. 1994 ఎన్నికల్లో అన్న గారు ఏకంగా 225 సీట్లను గెలుచుకోవడం వెనక అయిదేళ్ళ కాంగ్రెస్ పాలనతో పాటు అన్నగారి మీద పెరిగిన అనుకూలత పెద్ద కారణాలుగా ఉన్నాయి.

 

ఇక 2004 ఎన్నికల గురించి చెప్పుకోవాలంటే అప్పట్లో చంద్రబాబు పాలనకు విసిగి వేశారిన జనానికి వైఎస్సార్ రూపంలో అండ కనిపించింది. ఆయన చేసిన సుదీర్ఘ పాదయాత్ర ఇచ్చిన భరోసా తో జనం కదలి వచ్చి ఓటేసింది. అదే ప్రభంజనమై సాగింది. ఇక 2019 ఎన్నికల్లో మళ్ళీ అలాంటి ప్రభజనం కనిపిస్తోంది. అయితే ఇది తమకు అనుకూల వేవ్ అని టీడీపీ అంటోంది. కానీ అయిదేళ్ళు పాలన చేసిన సర్కార్ కి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తే తప్ప ఇంతటి స్థాయిలో పాజిటివ్ ఓటు రాదన్నది నిజం.



అమరావతి పూర్తి చేసినా, పోలవరం నిర్మాణం జరిగినా కూడా టీడీపీకి పెద్ద వేవ్ వచ్చేది. కానీ ఏపీలో అభివ్రుధ్ధి అన్నది పెద్దగా చెప్పుకునేందుకు లేదు. పైగా ప్తత్యేక హోదా రాలేదు, విభజన హామీలు నెరవెరలేదు. ఈ విషయంలో మోడీతో పాటు, నాలుగేళ్ళు కేంద్రంలో అధికారం వెలగబెట్టిన టీడీపీకి సమాన వాటా జనం ఇస్తున్నారు. ఇక సంక్షేమం  అంటున్నారు. పప్పు బెల్లాలు పంచితే అది సంక్షేమం ఎలా అవుతుంది. ఎన్నికల ముందు ఇచ్చే తాయిలాలకు జనం వెల్లువలా వస్తారనుకుంటే ఇక దేశంలో ప్రతిపక్షం ఎపుడూ గెలిచే అవకాశాలే లేవు.

 

మరి ఇంతటి ఓటింగ్ కసిగా ఎందుకు జరిగింది. అంటే దానికి కరెక్ట్ అయిన లాజిక్ ఉంది. ఈ అయిదేళ్ళ కాలంలో  ఏపీలో వైఎస్ జగన్ అన్న ఫోర్స్ బలంగా ఉంది. ఏపీలో జరిగిన ప్రతి పరిణామం జగన్ తో ముడిపడి సాగిపోయింది. ఇక 2014 ఎన్నికల్లో జగన్ అతి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఒక్క చాన్స్ అతనికి ఇవ్వాలన్న ఆకాంక్ష జనంలో బలంగా కనిపించింది. అదే విధంగా జగన్ అయిదేళ్ళ కాలంలో ఒక్క రోజూ రెస్ట్ తీసుకోలేదు. మొత్తం జీవితం ప్రజలతోనే గడిచింది.

 

ఇక పాదయాత్ర ఓ ప్రభంజనం గా సాగింది. ఓ విధంగా ఈ ఎన్నికల్లో పాదయాత్ర గొప్ప ఆయుధంగా పనిచేసిందని చెప్పుకోవాలి. ఆ విధంగా చూసుకుంటే జగన్ కి అనుకూలంగా వీచిన బలమైన గాలిగా ఈసారి పోలింగ్ సరళిని చెప్పుకోవాలి. ఇది సునామీగా మారుతుందని కూడా అంచనాలు ఉన్నాయి. అదే జరిగితే వైసీపీ అనూహ్యమైన రీతిలో సీట్లను గెలవడం ఖాయం. అదే సమయంలో  1994 నాటి ఫలితాలు ప్రతిపక్షానికి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: