ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరిపై అనేక రూపాల్లో విస్మయం, వివాదం కూడా రేకెత్తుతోంది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆయన తప్పు పట్టడమే కాకుండా తనదైన శైలిలో యుద్ధానికి కూడా పిలుపునిచ్చారు. ఏపీలో అధికారులను బదిలీచేయడం, ఎన్నికలను అర్ధరాత్రి దాటాక కూడా నిర్వహించడం, ప్రధాన ప్రతిపక్షం వైసీపీకి అనుకూలంగా ఎన్నికల సంఘం వ్యవహరించిందనే వ్యాఖ్యల నేపథ్యంలో చంద్రబాబు ఎన్నికల సంఘంపై యుద్ధాన్ని ప్రకటించారు. నేరుగా ఢిల్లీకే వెళ్లిన చంద్రబాబు ఎన్నికల సంఘం ఫుల్‌ బెంచ్‌ను కలిసి తన వాదనను వినిపించారు. ఈ నేపథ్యంలో ఏపీలో జరిగిన ఎన్నికల సరళిపై చర్చకు ఎన్నికల సంఘం సిద్ధం కావడం ఒకరకంగా బాబు సాధించిన విజయమే అని ఆ పార్టీ నేతలు చెబుతున్నా.. నేరుగా వెళ్లి రాజ్యాంగ బద్ధ సంస్థ, పూర్తిస్థాయి స్వయం ప్రతిపత్తి ఉన్న ఎన్నికల సంఘంతో తలపడడాన్ని మాత్రం తప్పుపడుతున్నారు. 


వాస్తవానికి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఎన్నికలు నిర్వహించే హక్కు, దీనికి సంబంధించి చలాయించే అధికారాలను రాజ్యాంగమే ఎన్నికలకు సంఘానికి బదలాయించింది. రాజ్యాంగంలోని 324వ ఆర్టికల్‌ ఎన్నికల ప్రక్రియ, నిర్వహణ, కమిషనర్ల అధికారాలను స్పష్టంగా పేర్కొంది. ఈ కమిషన్‌ కేవలం రాష్ట్రపతికి మాత్రమే సమాధానం చెప్పాలని ఈ ఆర్టికల్‌ స్పష్టం చేస్తోంది. అంతేకాదు, నానాటికీ పదునుతేలుతున్న ఎన్నికల అక్రమాలపై కొరడా ఝుళిపించే అధికారం, నాయకులను క్రమశిక్షణలో పెట్టే హక్కు కూడా ఎన్నికల సంఘానిదేనని గతంలో కమిషనర్‌గా పనిచేసిన టీఎన్‌ శేషన్‌, లింగ్డో వంటి వారు స్పష్టం చేసి, అమలులో కూడా చూపించి ఎన్నికల సంఘం ప్రత్యేకతను చాటి చెప్పారు. ఈ క్రమంలో ఎన్నికలు నిర్వహించే రాష్ట్రాలో పోలీసుల, కార్యనిర్వాహక వ్యవస్థలను ఎన్నికల సంఘం అదుపు చేసేందుకు, బదిలీ చేసేందుకు కూడాఅధికారాలు ఏర్పడ్డాయి. 


ఇక, ఇప్పుడు చంద్రబాబు వాదన విషయానికి వస్తే.. ఏపీలో ఎన్నికలకు ముందు.. అంటే నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇంటెలిజెన్స్‌ అధిపతి ఏబీ వెంకటేశ్వరరావు, కడప ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ, శ్రీకాకుళం ఎస్పీలను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. అయితే, ఈ పరిణామాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేక పోయారు. వైసీపీ ఫిర్యాదు చేయడం , మీరు మార్చడమేంటని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు, అసలు ఇంటెలిజెన్స్‌ అధిపతి ఎన్నికల సంఘం పరిధిలోకే రారని, కాబట్టి ఆయనను బదిలీ చేయబోమని ఆయన అధికారికంగానే ప్రకటించారు. కోర్టుకు కూడా వెళ్లారు. అయితే, కోర్టులో ఎన్నికల  సంఘానికి అనుకూలంగా తీర్పు రావడంతో బదిలీల విషయంలో చంద్రబాబు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇక, తమ ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించారని పేర్కొంటూ.. ఎన్నికల సంఘం.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్వి పునేఠాను సైతం బదిలీ చేసేసింది. 


అదేసమయంలో ఈ స్థానంలో జగన్‌ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్‌ ఐఏఎస్‌ అదికారి ఎల్వీ సుబ్రమణ్యంను నియమించింది. ఇది చంద్రబాబుకు మరింతగా ఆగ్రహం తెప్పించింది. ఈ క్రమంలోనే ఆయన తన ఫార్టీ ఇయర్స్‌ పొలిటికల్‌ అనుభవాన్ని సైతం పక్కకు పెట్టి.. ఎల్వీపై విరుచుకుపడ్డారు. జగన్‌ కేసులో సహనిందితుడిగా ఉన్నఅధికారికి సీఎస్‌గా పగ్గాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇది మరో తేనెతుట్టెను కదిపినట్టే అయింది. దీనిపై మాజీ ఐఏఎస్‌ లు సహా ప్రస్తుతం కలెక్టర్లుగా ఉన్నవారు సైతం బాబును తప్పుపడుతున్నారు. ఇక, ఈసీ విషయానికి వస్తే. అధికారాలను ప్రశ్నిస్తున్న చంద్రబాబుకు కనీసం రాజ్యాంగంపై అవగాహన లేదనే విపక్షాల విమర్శలు పరిగణనలోకి వచ్చాయి. ఎన్నికల నిర్వహణపై జరిగిన లోపాలపై ఆయన ప్రశ్నించకుండా ఏకంగా ఎన్నికల సంఘం అధికారాలనే ప్రశ్నించడం ఆయనకు మైనస్‌గా మారింది. ఏదేమైనా.. చంద్రబాబు చేస్తున్న రగడ, వేస్తున్న అడుగులు కూడా చాలా మేరకు ఆయనకు మైనస్‌గా మారుతున్నాయని అంటున్నారు పరిశీలకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: