రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సమరం అనేక మలుపులు, వివాదాలు, ఘర్షణల మ‌ధ్య ముగిసింది. మొత్తంగా 80% మేర పోలింగ్‌ నమోదైంది. ఈ ఎన్నికల్లో మహిళా ఓటింగ్‌ పెరగడం, పురుష ఓట్లు తగ్గడం గమ నార్హం. అయితే, ఈ పరిణామాన్ని రెండు ప్రధాన పార్టీలు కూడా తమకు సానుకూలంగానే తీసుకోవడం గమనార్హం. ఎవ‌రికి వారు గెలుపు మాదే అన్న ధీమాతో ఉన్నారు. అయితే, ఎవరు ఎలాంటి అంచనాలు వేసుకుని ముందుకు సాగినా కూడా తుది ఫలితం కోసం మే 23 వరకు వెయిట్‌ చేయకతప్పదు. 
ఇక, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం వైసీపీ చెబుతున్న ఎన్నికల ఫలితాలను విశ్లేషిద్దాం. ఏపీని పాలించేందుకు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న జగన్‌.. గత ఎన్నికల్లో కోల్పోయిన ఓట్లను రాబట్టి ఈ దఫా.. గెలుపుగుర్రం ఎక్కాలని శతవిధాలా ప్రయత్నాలు చేసింది. ముఖ్యంగా పార్టీ అధినేత జగన్‌ పాదయాత్ర ఇక్కడ కలిసి వచ్చిన అంశంగా చెప్పాలి. అదేసమయంలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడా తమకు కలిసి వస్తుందని ఇక్కడ వైసీపీ అంచనా వేస్తోంది. మొత్తంగా చూసుకుంటే.. వైసీపీ అంచనాల ప్రకారం విజయనగరం జిల్లాలోని మొత్తం 9 నియోజకవర్గాల్లో.. ఈ దఫా వైసీపీ దూకుడు ప్రదర్శిస్తుందని అంటున్నారు. 


ఈ పార్టీ అంచనాల ప్రకారం.. 5 చోట్ల వైసీపీ విజయం సాధించే అవకాశం ఉందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. ఇక, టీడీపీ మొత్తంగా కేవలం 4 స్థానాల్లో మాత్రమే విజయం  సాధిస్తుందని ఈ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. వైసీపీ వర్గాలు వేస్తున్న అంచనాల ప్రకారం.. విజయనగరంలోకి చాలా నియోజకవర్గాల్లో వైసీపీ వర్సెస్‌ టీడీపీ నువ్వా-నేనా? అనే రేంజ్‌లో ఫైట్‌ సాగుతుందని చెబు తున్నారు. గత ఎన్నికల ఫలితాలను అంచనా వేసుకుంటే.. ఏడు చోట్ల టీడీపీ విజయం సాధించగా.. వైసీపీ కేవలం 2 స్థానాల్లో మాత్రమే గెలుపు గుర్రం ఎక్కింది. అయితే, మారిన అంచనాల నేపథ్యం, పెరిగిన మహిళా ఓటు బ్యాంకు వంటి రీజన్ల నేపథ్యంలో వైసీపీ విజయం ఖాయమని ఈ పార్టీ నేతలు లెక్కలు కడుతున్నారు. 


కొన్ని నియోజకవర్గాల్లో ఇరు పార్టీల మధ్య గట్టి పోటీ ఉన్నప్పటికీ.. గెలుపు మాత్రం వైసీపీకి అనుకూలంగానే ఉంటుందని చెబుతున్నారు. కరుపాం, పార్వతీపురం, సాలూరు, చీపురుపల్లి, గజపతినగరం నియోజకవర్గాల్లో వైసీపీ విజయం ఖాయమని చెబుతున్నారు. అయితే, పార్వతీపురం, నెల్లిమర్ల, బొబ్బిలిలో వైసీపీ-టీడీపీల మధ్య గట్టి పోటీ నడుస్తుండడం గమనార్హం. ఇక, టీడీపీ విషయానికి వస్తే.. నెల్లిమర్ల, శృంగవరపుకోట, విజ‌య‌న‌గరం, ట‌ట్ ఫైట్‌లో బొబ్బిలి నియోజకవర్గాలను కైవసం చేసుకుంటుందని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఏం జరుగుతుంది? ఈ అంచనాలు ఏ మేరకు ఫలితాన్ని ఇస్తాయి? వంటి అంశాలు తెలియాలంటే.. మే 23 వరకు వెయిట్‌ చేయాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: