రాజకీయ చైతన్యం ఉన్న జిల్లాగా గుర్తింపు పొందిన ప్రకాశం జిల్లాలో ఈ దఫా వైసీపీ పుంజుకుందా? ఎన్నికలకు ముందు పరిస్థితి ఎలా ఉన్నా.. ఎన్నికల్లో ప్రజలు మాత్రం వైసీపీకి జై కొట్టారా? ఏకపక్షంగా పోలింగ్‌ జరిగిపోయిందా?  అధికార పార్టీలోని లోపాలను వైసీపీ అందిపుచ్చుకుని ఇక్కడ పరుగులు పెట్టిందా? ఇక్కడ మెజారిటీ స్థానాల్లో వైసీపీ విజయం సాధించనుందా? అంటే.. తాజా ఎన్నికల అనంతరం ప్రధాన ప్రతిపక్షం వైసీపీ నేతలు వేస్తున్న అంచనాలు ఔననే అంటున్నాయి. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో చాలా చోట్ల వైసీపీ వర్సెస్‌ టీడీపీ గట్టి పోటీ ఎన్నికలు జరిగాయి. ఎక్కడికక్కడ బలమైన అభ్యర్థులు నువ్వా-నేనా? అనే రేంజ్‌లో తలపడ్డారు. దీంతో ఎన్నికలు అనుకున్నంత సాఫీగా సాగలేదనే చెప్పాలి. అయితే, ప్రజల తీర్పు మాత్రం ఈవీఎంలలో నిక్షిప్తం అయిపోయింది. ఇక, ఈ ఫలితం వచ్చేందుకు నలభై రోజులకు పైగానే గడువు ఉంది. 


అయితే, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎవరికి వారు గెలుపు మాదంటే మాదేనని అంచనాలు వేసుకుంటున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ టీడీపీ తాము అమలు చేసిన ప్రభుత్వ పథకాలు, సంక్షేమం వంటివి తమకు మరోసారి అధికారాన్ని చేరువ చేస్తాయని ధీమా వ్యక్తం చేస్తుంటే.. వైసీపీ మాత్రం ప్రభుత్వ వ్యతిరేకత, అంతకు మించి అధికార పార్టీ నేతల ఆగడాలు వంటివి తమకు ప్లస్‌ అవుతున్నాయని అంచనా వేస్తోంది. ఈ పరిణామం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలను వేడెక్కించింది. ఇక, ముచ్చటగా మూడో పార్టీ జనసేన పెద్దగా ఎక్కడా ప్రభావం చూపించలేక పోయింది. సామాజిక మార్పు తెస్తానన్న పవన్‌ కళ్యాణ్‌ను ప్రజలు విశ్వసించినా.. ఆయన మాత్రం లక్ష్య శుద్ధి లేని పోరాటమే చేశారని, దీంతో ఆయన పరాజయాన్ని ఆయనే కొని తెచ్చుకున్నాడని మేధావులు సైతం చెబుతున్నారు. ఇక, ప్రధాన పోటీ రాష్ట్రంలో వైసీపీ వరెస్‌ టీడీపీగానే సాగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. 


అయితే, సాధారణంగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితి, పొరుగు రాష్ట్రం తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేసిన రిటర్న్‌ గిఫ్ట్‌ స్టేట్‌మెంట్స్‌ నేపథ్యంలో రాష్ట్రంలో జరిగిన ఎన్నికలకు ప్రాధాన్యం అమాంతం పెరిగింది. ప్రతి ఒక్కరినీ పోలింగ్‌ బూతు వైపు నడిపించింది. ఫలితంగా విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారు. అర్ధరాత్రి, తెల్లవారుజాము వరకు కూడా జరిగిన ఎన్నికల్లో తమ హక్కును వినియోగించుకున్నారు. దీంతో పోలింగ్‌ శాతం అమాంతం 80 శాతానికి పెరిగింది. దీంతో ఏ పార్టీ విజయం సాదిస్తుంది? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. తాజాగా వైసీపీ తన అంచనాలు వెల్లడించింది. టీడీపీ అధినేత చంద్రబాబు తన వ్యూహం ప్రకారం రాష్ట్రంలో 130 పైగా సీట్లను తాము గెలుచుకుంటామని వెల్లడించి సంచలనం సృష్టించారు. 


ఇక, వైసీపీ వెల్లడించిన ఫలితాలను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆపార్టీ హవా జోరుగా కనిపిస్తోంది. ప్రకాశం జిల్లాను తీసుకుంటే.. ఇక్కడ మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో తాజా వైసీపీ అంచనాల ప్రకారం 3 టీడీపీ, 9 వైసీపీ కైవసం చేసుకుంటుంద‌ని తెలుస్తోంది. పరుచూరు, కొండపి, అద్దంకి నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధిస్తే.. ఎర్రగొండపాలెం, దర్శి, చీరాల, సంతనూతలపాడు, ఒంగోలు, కనిగిరి, కందుకూరు,  మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల్లో వైసీపీ ఫ్యాన్‌ జోరు పెరిగినట్టు చెబుతున్నారు. అయితే, పరుచూరు, అద్దంకి, చీరాల, ఒంగోలు, కొండపి నియోజకవర్గాల్లో మాత్రం ఇరు పార్టీల మధ్య భారీ ఎత్తున పోరు సాగింది. దీంతో ఈ నియోజకవర్గాల్లో ఎవరు గెలిచినా.. నామమాత్రపు మెజారిటీనే దక్కుతుందని అంటున్నారు. మరి ఇది ఏమేరకు నిజమో తెలియాలంటే.. మే 23వరకు వెయిట్‌ చేయాల్సిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: