రాష్ట్రంలో అత్యంత ఉత్కంఠకు తెరదీసిన ఎన్నికల పర్వం ముగిసింది. అధికారాన్ని తిరిగి నిలబెట్టుకునేందుకు టీడీపీ, ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ చేసిన ప్రయత్నాలు అందరికీ తెలిసిందే. ప్రచార పర్వానికి ముందు నుంచి కూడా ఈ రెండు పార్టీలు తమదైన వ్యూహంతో ముందుకు సాగాయి. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రజల నాడిని పట్టుకునేందుకు తమ తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే ఆచితూచి అడుగులు వేశాయి. గెలుపు గుర్రాలకు మాత్రమే అవకాశం కల్పించారు. ఎలాంటి మొహమాటాలకు కూడా తావివ్వని విధంగా అభ్యర్థుల ఎంపిక కూడా సాగింది. అదేసమయంలో ఆర్థికంగా బలంగా ఉన్న వారికి మాత్రమే ఛాన్స్‌ ఇచ్చారు. ఇక, సామాజిక వర్గాల వారీగా కూడికలు, తీసివేతలు భారీ ఎత్తున సాగాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ వైసీపీ, టీడీపీలు తమ ముద్రను బలంగా వేయాలని నిర్ణయించుకున్నాయి. 


అధికారంలోకి వచ్చే పార్టీకి మేజిక్‌ ఫిగర్‌ 88 వస్తే సరిపోతుంది. కానీ, ఏ పార్టీ అయినా పూర్తిస్థాయి మెజారిటీతో పాటు కనీసం 100కు పైగా సీట్లు కైవసం చేసుకునే లక్ష్యంతో ముందుకు సాగాయని చెప్పాలి. మరో ప్రధాన పార్టీగా ప్రజల్లోకి వచ్చిన జనసేన ఈ ఎన్నికల్లో తన పాత్రను పూర్తిగా నిర్వర్తించలేక పోయింది. ప్రధానంగా తమకంటూ ప్రత్యామ్నాయం కనిపించిందని, ప్రత్యామ్నాయ నాయకుడు వచ్చాడని పవన్‌ కళ్యాణ్‌ను చూసి మేధావులు, ప్రజల్లోని ఓవర్గం కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. తీరా ఎన్నికల సమయం వచ్చే సరికి పవన్‌ వ్యవహారశైలి.. పూర్తిగా తిరోగమనంలో సాగింది. పవన్‌ చేసిన ప్రసంగాలు, ఇచ్చిన హామీలు కూడా ప్రజల్లోకి బలంగా వెళ్లలేకపోయాయి. పైగా.. ఆయన ప్రతిపక్షాన్ని టార్గెట్‌ చేయడం ఎవరూ మెచ్చుకోలేని ప్రధాన పరిణామం. ఇక, ప్రజలపై సంక్షేమ పథకాలతో టీడీపీ విజృంభించింది. 


ముఖ్యంగా పసుపు-కుంకుమ పేరుతో మహిళలకు రూ.10 వేలు ముట్టజెప్పడం, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగుల పింఛన్‌, అన్న క్యాంటీన్లు, పింఛన్ల పెంపు వంటివి బాగా పనిచేస్తాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆశించారు. అదేసమయంలో గతానికి పూర్తి భిన్నంగా చంద్రబాబు తన ప్రసంగాల్లో వాడిని, వేడిని కూడా పెంచారు. బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా మార్చుకున్నారు. ప్రతి ఒక్కరికీ దగ్గరయ్యే ప్రయత్నాలు చేశారు. వంగివంగి నమస్కారాలు చేశారు. టీడీపీ ప్రభుత్వం రాకపోతే.. అభివృద్ధి ఆగిపోతుందనే ప్రచారాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లారు. ఇన్ని పరిణామాల నేపథ్యంలో జరిగిన ఈ ఎన్నికలు ఏపీలోనే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల్లోనూ ఉత్కంఠ నెలకొనేలా చేశాయి. ఇక, ఈ ఎన్నికల ఫలితాలు వచ్చేందుకు మరో నెల రోజులకు పైగా సమయం ఉంది. దీంతో ఎక్కడికక్కడ ఈ ఎన్నికల ఫలితాలపై తీవ్రమైన చర్చ సాగుతోంది. 


ఇక, తాజా ఎన్నికల ఫలితాలపై ఏ పార్టీకి ఆపార్టీ తనదైన నిర్వచనాలు చెప్పుకొంటోంది. అదేసమయంలో తమదైన ఫలితాలను కూడా వేసుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఏకంగా 130 సీట్లుతమవేనని ఎన్నికలు ముగిసిన వెంటనే ధీమా వ్యక్తం చేయడం గమనార్హం. ఇక, వైసీపీ జిల్లాల వారిగా తమ లెక్కలు చెప్పుకొచ్చింది. వీటిలో గుంటూరు జిల్లా విషయానికి వస్తే.. వైసీపీ అంచనాల ప్రకారం ఇక్కడ 10 స్థానాల్లో వైసీపీ 7 చోట్ల మాత్రమే టీడీపీ గెలుపు గుర్రం ఎక్కుతుందని తేలింది. నియోజకవర్గాల వారీగా చూసుకుంటే.. తాడికొండ, మంగళగిరి, వేమూరు, రేపల్లి, బాపట్ల, పత్తిపాడు, చిలకలూరిపేట, సత్తెనపల్లి, నరసారావు పేట, మాచర్లలో వైసీపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక, అధికార పార్టీ విషయానికి వస్తే.. పెదకూరపాడు, పొన్నూరు, తెనాలి, గుంటూరు ఈస్ట్‌, వెస్ట్‌, వినుకొండ, గురజాల నియోజకవర్గాల్లో ఆ పార్టీ విజయం సాధిస్తుందని అంచనాకు వచ్చారు. ఈ నియోజకవర్గాల్లో చాలా చోట్ల టైట్‌ ఫైట్‌ ఉంటుందని లెక్కలు తేల్చారు. మరి వాస్తవ ఫలితంలో ఎలా ఉంటుంది? ఎవరు ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంటారు? అనే విషయం మే 23 వరకు సస్పెన్సే!!



మరింత సమాచారం తెలుసుకోండి: