ఏపీలో సాధార‌ణ ఎన్నిక‌లు ముగిశాయి. ఫ‌లితాల వెల్ల‌డికి చాలా టైం ఉండ‌డంతో ఎవ‌రి అంచ‌నాల్లో వారు మునిగి తేలుతున్నారు. రాష్ట్రానికే గుండెకాయ లాంటి కృష్ణా జిల్లాలో ఈ సారి చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ట‌ఫ్ ఫైట్ ఉంది. మూడు, నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో ట్ర‌యాంగిల్ ఫైట్ కూడా న‌డుస్తోంది. ఒక‌టి రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన కూడా గెలుస్తుంద‌ని ఆ పార్టీ వాళ్లు లెక్క‌లు వేసుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో మహిళా ఓటింగ్‌ పెరగడం, పురుష ఓట్లు తగ్గడం గమ నార్హం. గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ కృష్ణా జిల్లాలో దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోన్న టీడీపీకి ఈ సారి దెబ్బ త‌ప్పేలా లేదు. ఆ పార్టీకి కంచుకోట‌లుగా ఉన్న కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఈ సారి ఆ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్య‌ర్థులు గ‌ట్టి పోటీ ఎదుర్కొన్నారు.


ఇక, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం వైసీపీ చెబుతున్న ఎన్నికల ఫలితాలను విశ్లేషిద్దాం. ఏపీని పాలించేందుకు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న జగన్‌.. గత ఎన్నికల్లో కోల్పోయిన ఓట్లను రాబట్టి ఈ దఫా.. గెలుపుగుర్రం ఎక్కాలని శతవిధాలా ప్రయత్నాలు చేసింది. ముఖ్యంగా పార్టీ అధినేత జగన్‌ పాదయాత్ర ఇక్కడ కలిసి వచ్చిన అంశంగా చెప్పాలి. అదేసమయంలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడా తమకు కలిసి వస్తుందని ఇక్కడ వైసీపీ అంచనా వేస్తోంది. మొత్తంగా చూసుకుంటే.. వైసీపీ అంచనాల ప్రకారం కృష్ణా జిల్లాలోని మొత్తం 16 నియోజకవర్గాల్లో.. ఈ దఫా వైసీపీ దూకుడు ప్రదర్శిస్తుందని అంటున్నారు. వాస్తవానికి కృష్ణా జిల్లా అంటే రాజధాని ప్రాంతంగా బాగా గుర్తింపు సాధించింది. ఇక్కడ టీడీపీకి కంచుకోటలుగా అనేక నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి గతంలో మండలి బుద్ధ ప్రసాద్‌, గద్దె రామ్మోహన్‌ వంటి హేమా హేమీలు టీడీపీ తరఫున విజయం సాధించారు. అయితే, ఈసారి మాత్రం ప్రజలు తమవెంటే ఉన్నారని వైసీపీ అంచనాలు కడుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత, సమస్యలు పట్టించుకోక పోవడం వంటివి తమకు అనుకూలంగా మారాయని వైసీపీ చెబుతోంది. 


వైసీపీ అంచనాల ప్రకారం.. మొత్తం 16 సీట్లలో టైట్‌ ఫైట్‌ మధ్య కేవలం 5 స్థానాల్లో మాత్రమే టీడీపీ విజయం సాధించే అవకాశం ఉంది. మిగిలిన స్థానాల్లో వైసీపీ విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ నాయకులు లెక్కలు వేస్తున్నారు. గత ఎన్నికల్లో కృష్ణాజిల్లాలోని మెజారిటీ స్థానాల్లో టీడీపీ విజయదుందుభి మోగించింది. అప్పటి ఎన్నికల్లో మొత్తం 11 స్థానాల నుంచి టీడీపీ గెలుపు గుర్రం ఎక్కగా, వైసీపీ 4 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఇక, బీజేపీ ఒక స్థానంలో గెలించింది. ఇక, తాజా ఎన్నికలకు సంబంధించి వైసీపీ వర్గాలు వేస్తున్న అంచనాల ప్రకారం.. కృష్ణా జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో వైసీపీ వర్సెస్‌ టీడీపీ నువ్వా-నేనా? అనే రేంజ్‌లో ఫైట్‌ సాగుతుందని చెబుతున్నారు. మారిన అంచనాల నేపథ్యం, పెరిగిన మహిళా ఓటు బ్యాంకు వంటి రీజన్ల నేపథ్యంలో వైసీపీ విజయం ఖాయమని ఈ పార్టీ నేతలు లెక్కలు కడుతున్నారు. 


కొన్ని నియోజకవర్గాల్లో ఇరు పార్టీల మధ్య గట్టి పోటీ ఉన్నప్పటికీ.. మెజారిటీ సీట్లలో గెలుపు మాత్రం వైసీపీకి అనుకూలంగానే ఉంటుందని చెబుతున్నారు. ఇక, నియోజకవర్గాల వారీగా చూసుకుంటే.. నూజివీడు, గుడివాడ, కైకలూరు, పెడన, మచిలీపట్నం, పామర్రు, పెనమలూరు, విజయవాడ పశ్చిమ, సెంట్రల్‌, మైలవరం, జగ్గయ్యపేట నియోజకవర్గాలు వైసీపీ ఖాతాలో పడగా, తిరువూరు, గన్నవరం, అవనిగడ్డ, విజయవాడ తూర్పు, నందిగామ నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీ విజయం ఖాయమని తేల్చారు. అయితే, వీటిలో చాలా నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఉంది. అదేసమయంలో ఎవరు గెలిచినా మెజారిటీ మాత్రం నామమాత్రంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇలా మొత్తానికి మారుతున్న రాజకీయ సమీకరణలు కూడా తమకు కలిసి వస్తాయని వైసీపీ అంచనా వేసుకుంది. మరి ఇది నిజమా? కాదా? అనేది తెలియాలంటే మే 23 వరకు వెయిట్‌ చేయాల్సిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: