ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు తీరుపై టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు, ఆయ‌న చేస్తున్న విమ‌ర్శ‌ల‌పై కేటీఆర్ విరుచుకుప‌డ్డారు. తెలంగాణలో ఎన్నికలు జరిగిన తీరు టీఆర్‌ఎస్ పాలనకు అద్దం పడుతుండ‌గా, ఏపీలో ఎన్నికలు జరిగిన తీరు వాళ్ల పాలనకు అద్దం పడుతోందని అన్నారు. చంద్రబాబు చిల్లర రాజకీయాలు ఇకనైనా మానుకోవాలని మండిప‌డ్డారు. ``ఏపీలో అధికారులను ఈసీ బదిలీ చేస్తే చంద్రబాబుకెందుకు భయం. వంగి వంగి దండాలు పెట్టినప్పుడే చంద్రబాబు పనైపోయిందని అర్ధమైంది. 2014లో చంద్రబాబు ఈవీఎంలతో గెలవలేదా? చంద్రబాబు పనైపోయిందని వాళ్ల కార్యకర్తలే అనుకుంటున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ అనేది అసాధ్యం. ట్యాంపరింగ్ జరిగితే ప్రజలు తిరగబడతరు. రేపు చంద్రబాబు దారి తప్పి గెలిస్తే ఈవీఎంల తీరుపై ఏం మాట్లాడుతరు. కాంగ్రెస్‌కు దిక్కులేక బీజేపీకి ఓట్లు వేయించారు`` అని వ్యాఖ్యానించారు.
ఏ ఒక్క పథకంతో పార్టీలు అధికారంలోకి రావని కేటీఆర్ అన్నారు. పసుపు-కుంకుమ ప‌థ‌కం ఆధారంగా మహిళలు టీడీపీకి ఓటేశారన్న అంశంపై స్పందిస్తూ, బహుళ అంశాలు ప్రభావం చూపుతాయని స్పష్టం చేశారు. ``కేసీఆర్,జగన్ మోడీ పెంపుడు కుక్కలని చంద్రబాబు అంటారా? నాలుగేళ్లు మోదీతో అంటకాగిన చంద్రబాబును పెంపుడు కుక్క అని మేము అనలేమా? మాకు సంస్కారం ఉంది కాబట్టీ మేము అలా మాట్లాడము` అంటూ బాబు ప‌రువు తీసేశారు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఏబీ వెంకటేశ్వర్‌రావు ఏం చేశారో అందరికీ తెలుసున‌ని కేటీఆర్ అన్నారు. ``ఆంధ్రజ్యోతి పేపర్‌లో జాహ్నవి పేరుతో తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా కథనాలు రాశారు. అలాంటి అధికారులను బదిలీ చేస్తే చంద్రబాబుకు ఎందుకంత భయం?``అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. 
పార్లమెంట్ ఎన్నికల్లో 5 స్థానాల్లో కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు అవుతుందని కేటీఆర్ ధీమా వ్య‌క్తం చేశారు. ఐదు స్థానాల్లో కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంటది. తెలంగాణ సమాజం బీజేపీని ఆదరిస్తారని అనుకోవడం లేదు. మా అంచనా ప్రకారం కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది. పారదర్శక పాలనను ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు స్వాగతిస్తాయని అనుకుంటున్నాం. రెవెన్యూలో మెజారిటీ ఉద్యోగులు మంచివారే.. కొంతమంది వల్లే సమస్యలు వస్తున్నాయి.`` అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: