ఒకనాటి అందాల తార జయప్రద యూపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె రాంపూర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగారు. యూపీ ప్రజలకు జయప్రద సుపరిచితురాలే. ఆమె గతంలో రాంపూర్‌ నుంచే్ సమాజ్‌వాడీ పార్టీ నుంచి విజయం సాధించారు కూడా. 


ఎస్పీ నేత ఆజం ఖాన్ తో విభేదాల కారణంగా ఆమె ఎస్పీ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆమె యూపీ రాజకీయాల్లో అడుగుపెట్టలేదు. ఇప్పుడు ఆమె బీజేపీలో చేరి మళ్లీ రాంపూర్ బరిలో దిగడంతో పోటీ రసవత్తరంగా మారింది. 

జయప్రద స్థానికురాలు కాదని.. ఆమె ఎన్నికలప్పుడే మళ్లీ రాంపూర్‌లో అడుగు పెట్టిందని ఎస్పీ విమర్శిస్తోంది. దీనికి ఘాటుగా బదులిచ్చేందుకు సిద్ధమైన జయప్రద పాత విషయాలనే ప్రచార అస్త్రాలుగా మలచుకుంటున్నారు. 

గతంలో తన అశ్లీల చిత్రాలను రాంపూర్ లో విరివిగా ప్రచారంలో పెట్టారని, తనను రక్షించాలని వేడుకున్నానని ఆమె గుర్తు చేశారు.  కానీ రాంపూర్ లో ఏ నాయకుడు కూడా తనను రక్షించడానికి ముందుకు రాలేదని జయప్రద అన్నారు. ఆ స్థితిలో తాను రాంపూర్ ను వదిలేసి వెళ్లాల్సి వచ్చిందని ఆమె ట్విట్టర్ ద్వారా వివరించారు. 

అంతే కాదు.. ఆజంఖాన్ పైనా ఆమె బాణాలు ఎక్కు పెట్టారు. ఆజం ఖాన్ సాహెబ్! నేను మిమ్మల్ని భాయ్ అని పిలిచా. కానీ మీరు సోదరిని కించపరిచారు. నన్ను అవమానించారు.  నిజంగానే సోదరుడైతే నన్ను నాట్యగత్తే అని అంటాడా. అందుకే నేను రాంపూర్ ను విడిచి వెళ్లాలని అనుకున్నా అంటూ ఆనాటి విషయాలను ప్రస్తావించారు. మరి ఈ మాటలు జయప్రదకు సానుభూతి కురిపిస్తాయో లేదో.. ?



మరింత సమాచారం తెలుసుకోండి: