ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఊహించ‌ని వివాదంలో చిక్కుకున్నారు. ఆయ‌న టార్గెట్‌గా కాంగ్రెస్ పార్టీ పెట్టిన స్పెష‌ల్ ఫోక‌స్ కార‌ణంగా, మోదీ మ‌రో వివాదంలో చిక్కుకున్నారు. త‌న ప్ర‌చారంలో ప్ర‌ధాన‌మంత్రి హోదాలో మోదీ డ‌బ్బుల త‌ర‌లింపున‌కు స‌హాయం చేస్తున్నార‌నేది కాంగ్రెస్ పార్టీ ఆరోప‌ణ‌. ఇందుకు ఆ పార్టీ త‌గు కార‌ణాల‌ను సైతం ప్ర‌స్తావిస్తోంది.


వివ‌రాల్లోకి వెళితే... ప్రధాని మోదీ ఇటీవల కర్ణాటకలోని చిత్రదుర్గలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్పుడు హెలికాప్టర్‌లో నల్లరంగు ట్రంకుపెట్టె ను తెచ్చారని, అందులో డబ్బు తరలించారని తమకు అనుమానాలు ఉన్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. దానిపై నిజానిజాలు తేల్చాలని కర్ణాటక కాంగ్రెస్ విభాగం ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేసింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్‌శర్మ్ మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని మోదీ దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్‌చేశారు. చిత్రదుర్గ పర్యటనకు మోదీ ఓ హెలికాప్టర్‌లో, రక్షణగా మరో 3 హెలికాప్టర్లు వచ్చాయి. ల్యాండయిన తర్వాత ఒక హెలికాప్టర్‌లో నుంచి నల్లని ట్రంకు పెట్టెను ప్రైవేట్ వ్యక్తి కారులో ఎక్కడికో తరలించారు. అందులో డబ్బు తరలించారనే అనుమానాలు వస్తున్నాయి అని అన్నారు. ఒకవేళ తమ ఆరోపణలు అవాస్తవమైతే, విచారణకు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. 


కేవ‌లం ఆరోప‌ణ‌లే కాకుండా అందుకు త‌గిన ఆధారాలంటూ ఆనంద్ శ‌ర్మ ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేశారు. అందులో ప్రధాని ప్రయాణించిన హెలికాప్టర్ నుంచి ఒక నల్లని పెట్టెను బయటికి తీసి.. ఇన్నోవా కారులో పెట్టి న దృశ్యాలు ఉన్నాయి. ఈ కారు ప్రధాని భద్రతా శ్రేణిలోనిది కాదని, ఆ పెట్టెను రహస్యంగా తరలించారని ఆనంద్‌శర్మ చెప్పారు. నిజాయితి గురించి ప్ర‌స్తావ‌వించే ప్ర‌ధాని ఈ డ‌బ్బుల త‌ర‌లింపుపై జ‌వాబివ్వాల‌ని కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: