తొలి సారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన జనసేన ఏపీలో క‌మ్యూనిష్టులతో పాటు బీఎస్పీతో కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేసింది. జనసేన అధికారంలోకి వస్తుందన్న అంచనాలు లేకపోయినా కొన్ని సీట్లలో ఖ‌చ్చితంగా ప్రభావం చూపుతుందన్న అంచనాలు ఉన్నాయి. జనసేన బలంగా చీల్చే ఓట్లతో ప్రధాన పార్టీలు అయిన టీడీపీ, వైసీపీ గెలుపు ఓటములు తారుమారు అవ్వడం ఖాయం. జనసేన వర్గాల అంచనాలు, లెక్కల ప్రకారం ఆ పార్టీ శాసించే స్థానాలు ప్ర‌ధానంగా కాపు సామాజిక‌వ‌ర్గం ఓట‌ర్లు ఎక్కువుగా ఉన్న చోటే ఉన్నాయి. ఉభ‌య‌గోదావ‌రి, విశాఖ‌, శ్రీకాకుళంతో పాటు గుంటూరు, కృష్ణా, సీమ‌లోని కొన్ని జిల్లాల్లో ఉన్నాయి. 


జ‌న‌సేన భారీగా ఓట్లు చీలుస్తామ‌ని లేదా గెలుస్తామ‌ని ఆశ‌లు పెట్టుకున్న స్థానాల్లో గుంటూరు పశ్చిమ, ప్రత్తిపాడు, వేమూరు, సత్తెనపల్లి, తణుకు, తిరుపతి, తంబళ్లపల్లి, కావలి, నెల్లూరు అర్బన్‌, విజయవాడ ఈస్ట్‌, కైకలూరు, పెడన, అవనిగడ్డ, కొత్తపేట, అమలాపురం, రామచంద్రాపురం, నరసాపురం, భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, పాతపట్నం, యలమంచలి, ఇచ్ఛాపురం, కురుపాం, నెల్లిమర్ల, రాజమండ్రి రూరల్‌, తునీ, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్‌, పి. గన్నవరం, రాజోలు, గాజువాక, పెందుర్తి అలాగే గతంలో ప్రజారాజ్యం పార్టీ 2009 ఎన్నికల్లో 500 నుంచి 5000 ఓట్ల తేడాతో ఓడిపోయిన మరో 30కి పైగా స్థానాల్లో సైతం ఈ సారి తాము గట్టి పోటీ ఇచ్చామని, ఈ స్థానాల్లో కొన్ని చోట్ల గట్టి పోటీ ఇవ్వడంతో పాటు మరి కొన్ని చోట్ల గెలుస్తామన్న లెక్కల్లో జనసేన శ్రేణులు ఉన్నాయి. 


తాము గట్టి పోటీ ఇచ్చన 20 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ మూడో స్థానానికి పడిపోయిందని కూడా ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. కాపు సామాజికర్గం ఓట్లనే బేసిక్‌గ్గా చేసుకుని వీరు తమ గెలుపుపై నమ్మకంతో ఉన్నారు. భీమిలిలో కాపు సామాజికవర్గం ఓటర్లు 88,000 ఉన్నారు. గాజువాకలో 60,000, విశాఖ ఉత్తరంలో 57,000, విశాఖ పశ్చిమంలో 48,000 ఓట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే విశాఖ లోక్‌సభ సీటును సైతం గెలుచుకోగలమన్న అంచనాతో జనసేన ఉంది.  అదే విశాఖ జిల్లాలోని అనకాపల్లి పార్లమెంట్‌ పరిది విషయానికి వస్తే చోడవరంలో 99,000 కాపు ఓటర్లు, అనకాపల్లిలో 89,000 ఓట్లు, పెందుర్తిలో 84,000 ఓట్లు, యలమంచలిలో 82,000 ఓట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రెండు ఎంపీ స్థానాలు కూడా గ్యారెంటీగా గెలుచుకుంటామన్న ధీమాతో జనసేన ఉంది. జనసేన లెక్క‌లు ఎలా ఉన్నా ఈ ఈక్వేషన్లు ఎలా సెట్‌ అవుతాయన్నది మాత్రం అంచనాకు అందడం లేదు. 


గతంలో ప్రజారాజ్యానికి ఉన్నంత ఊపు జనసేనకు రాలేదు. మరి ఈ లెక్కన చూస్తే ప్రజారాజ్యానికి వచ్చిన ఓట్ల కంటే జనసేనకు ఎక్కువ వస్తాయని ఆశించడం ఆత్యాశే అవుతుంది. ఇదే టైమ్‌లో గత ఎన్నికల్లో టీడీపీ వైపు మొగ్గు చూపిన కాపు సామాజికవర్గం ఓటర్లలో మెజారిటీ ప్రజలు ఖ‌చ్చితంగా జనసేన వైపు మల్లారు. అలాగే ఎస్సీల్లో ఒక సెక్షన్‌ పీపుల్‌తో పాటు మెనార్టీల్లోనూ కొంత మంది జనసేన వైపు మొగ్గు చూపారు. అయితే వీరిలో ఎంత మంది జనసేనకు ఓట్లు వేశారన్నది మాత్రం స్పష్టమైన క్లారిటీ లేదు. ఫైన‌ల్‌గా ఈ ఓట్ల చీలిక టీడీపీ, వైసీపీపై ఎంత మేర ప్రభావం చూపిందన్న దానిపైన జనసేన గెలుపు ఆధారపడి ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: