ఎన్నికల్లో ఓటు వజ్రాయుధమని, తిరుగులేని అస్త్రమని కబుర్లు చెబుతారు. ఓటు పవిత్రమైనదని కూడా నీతులు వల్లిస్తారు. మరి అటువంటి ఓటు వేసే హక్కు ఈ దేశంలో అందరికీ ఉందా. ఓటు అనేది ఆయుధమని చెబుతున్న పెద్ద మనుషులు దాన్ని సామాన్యులకు ఇస్తున్నారా అన్న ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి.


విషయానికి వస్తే విశాఖ జిల్లాలో మొత్తం పద్నాలుగు వేలమంది ఎన్నికల విధులో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేస్తే కేవలం  రెండంటే రెండు వేల మందికే పోస్టల్ బ్యాలెట్ ఇచ్చారు. మిగిలిన పన్నెండు వేల మందికి మాత్రం షాక్ తినిపించారు. ఇందులో అంగన్ వాడీ, ఆశా వర్కర్లు ఉన్నారు. దాంతో వారంతా తాము ఈ దేశంలో పౌరులము కాదా తమకు ఓటు వేసుకునే హక్కు లేదా అని ఆవేదన చెందుతున్నారట.


దీని మీద వైసీపీ సీనియర్ నాయకుడు దాడి వీరభద్రరావు మాట్లాడుతూ,  టీడీపీకి జిల్లా అధికారులు వత్తాసుగా ఉన్నారని విమర్శించారు. అందువల్లనే వేల సంఖ్యలో ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నరని హాట్ కామెంట్స్ చేశారు. ఇక ఇంతకు ముందే శిక్షణా కాలంలో పోలీసులకు ఇచ్చిన పోస్టల్ బ్యాలెట్ కూడా ఎంపీ వరకే పరిమితం చేశారని, వారికి ఎమ్మెల్యే అభ్యర్ధులకు వేసేందుకు అవకాశం ఇవ్వలేదని అన్నారు.


ఇక ఉపాధ్యాయులకు పోస్టల్ బ్యాలెట్ తీసుకోవాలంటే డీఈఓ, ఎం ఈవోలతో అనుసంధానం చేస్తున్నారని, ఇదెక్కడి అన్యాయమని దాడి ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులు వైసీపీకి అనుకూలంగా ఓటు వేస్తారని తేలడంతో వారి ఓట్లకు గండి పెట్టి గెలవాలని చూస్తున్నారని దాడి అన్నారు. దీని మీద వెంటనే చర్యలు తీసుకోకపోతే తాము  ఈసీని కలుస్తామని దాడి హెచ్చరించారు. 
మొత్తానికి చూసుకుంటే పోస్టల్ బ్యాలెట్ ఇపుడు విశాఖ జిల్లాలో చిచ్చు రేపుతోంది. ఎక్కువమందికి ఈసారి పోస్టల్ బ్యాలెట్ అందకపోవడం పట్ల కూడా నిరసన వ్యక్తం అవుతోంది. ఈ నెల 5న ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ లో వైసీపీకి అనుకూలంగా ఓట్లు పడడంతోనే ఇలా ఎక్కువమందికి ఇవ్వకుండా చేస్తున్నారన్న వైసీపీ ఆరోపణల‌పై పొలిటికల్ సర్కిళ్ళలో హాట్ డిస్కషన్ జరుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: