ఏపీ రాజ‌కీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక ప్ర‌యోగం జ‌రుగుతూనే ఉంది. 2009 నాటి ఎన్నిక‌ల్లో మెగా స్టార్ చిరంజీవి అరంగే ట్రం ఏపీలో రాజ‌కీయాల‌ను కొత్త‌మ‌లుపు తిప్పింది. సామాజిక మార్పు నినాదంతో ప్ర‌జారాజ్యం పార్టీని స్తాపించిన చిరు.. 18 స్థానాల్లో విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా గ‌ణ‌నీయంగా ఓటు బ్యాంకును కైవ‌సం చేసుకున్నారు. ఇక‌, 2014 ఎన్నిక‌ల‌కు వ‌చ్చేస‌రికి ఆయ‌న సోద‌రుడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. త‌న‌దైన కొత్త పార్టీతో ఏపీలో అరంగేట్రం చేశారు. అయితే, ఆ ఎన్నిక‌ల్లో త‌ను పోటీకి దూరంగా ఉన్న అటు బీజేపీ, ఇటు టీడీపీల‌కు అండ‌గా నిలిచారు. మొత్తానికి ఎన్నిక‌ల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌లిగారు. కేవ‌లం 5 ల‌క్ష‌ల ఓట్ల తేడాతో అధికార పీఠానికి చేరువ అయిన జ‌గ‌న్‌ను దూరం చేయ‌గ‌లిగారు. 


ఇక‌, ఇప్పుడు జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ త‌న పార్టీ జ‌న‌సేన‌ను ఎన్నిక‌ల ర‌ణ క్షేత్రంలోకి దింపారు. సీపీఐ, సీపీఎం, బీఎస్పీ ల‌తో పొత్తు పెట్టుకుని ఎన్నిక‌ల‌కు వెళ్లారు. ప్ర‌శ్నిస్తానంటూ ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చిన ప‌వ‌న్ చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై కొన్ని ద‌శ‌ల్లో సాగించిన ఉద్య‌మాలు ఫ‌లితాల‌ను ఇచ్చాయి. శ్రీకాకుళం కిడ్నీ బాధితులు, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఆక్వా ప‌రిశ్ర‌మ బాధితులు, మంగ‌ళ‌గిరి రాజ‌ధాని రైతుల క‌ష్టాలు, క‌ర్నూలు బ్లాస్టింగ్ మృతుల కుటుంబీకులు, విద్యార్థుల క‌ష్టాలు, తిత‌లీ తుఫాను బాధితుల త‌ర‌పున ప‌వ‌న్ త‌న గ‌ళాన్ని వినిపించారు. స‌క్సెస్ కూడా అయ్యారు. ఇక‌, ఎన్నిక‌లకు వ‌చ్చే స‌రికి ఒక స్ప‌ష్ట‌మైన వ్యూహంతో ముందుకు వెళ్లార‌ని తెలుస్తోంది. 


త‌న‌కు ఇప్ప‌టికిప్పుడు సీఎం సీటుపై క‌న్నులేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేస్తూనే.. ఆర్థికంగా అనేక ఆరోప‌ణ‌లు, కేసులు ఎదుర్కొంటున్న జ‌గ‌న్‌ను సీఎం కాకుండా అడ్డుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు వెళ్లిన‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపించింది. అలాగ‌ని చంద్ర‌బాబును కానీ, టీడీపీని కానీ, ప‌వ‌న్ ఎక్క‌డా స‌పోర్టు చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, బీఎస్పీతో పొత్తు పెట్టుకుని, ఆ పార్టీ అధినేత్రి మాయావ‌తిని ఏపీకి తీసుకురావ‌డంలోను, ఎస్పీల‌ను త‌న‌వైపు తిప్పుకోవ‌డంలోను ప‌వ‌న్ స‌క్సెస్ అయ్యారు. అంబేడ్క‌ర్ ఆశ‌యాల‌కు అనుగుణంగా స‌మాజంలో మార్పు వ‌స్తేనే ఫ‌లితం వ‌స్తుంద‌ని న‌మ్మిన ప‌వ‌న్ ఆది నుంచి కూడా త‌న సిద్ధాంతానికి అనుకూలంగా రాజ‌కీయాలు చేసిన విష‌యం స్ప‌ష్టంగా క‌నిపించింది. 


ఒక‌ప‌క్క యువ‌త ఓట్లు, మ‌రోప‌క్క‌, కాపు సామాజిక వ‌ర్గం ఓట్లు కూడా ప‌వ‌న్‌కు వెన్నంటి ఉండ‌డం స్ప‌ష్టంగా క‌నిపించిం ద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అదే స‌మ‌యంలో మాయావ‌తి ప్ర‌భావంతో ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో ఎస్సీ వ‌ర్గం మొత్తంగా కాక‌పోయినా.. స‌గానికి పైగానే ప‌వ‌న్ వెంట న‌డిచిన‌ట్టు అంచ‌నా వేస్తున్నారు. ఇక‌, ముస్లింలు కూడా ప‌వ‌న్ వెంట న‌డిచేందుకు సిద్ధం కావ‌డం గ‌మ‌నార్హం. ఎన్ని స్థానాల్లో గెలుస్తాన‌నే విష‌యం క‌న్నా..కూడా ఎంత‌మంది ప్ర‌జ‌లు త‌న‌వెంట ఉన్నార‌నే విష‌యాన్ని ప్రాతిప‌దిక‌గా చేసుకుని ప‌వ‌న్ చేసిన రాజ‌కీయం అద్భుతః అంటున్నారు రాజ‌కీయ నిపుణులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: