శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. గత ఏడాది కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు ప్రవేశించవచ్చని అనుమతి ఇచ్చింది. అయితే రాష్ట్రంలోని హిందూవాద సంస్థలు ఈ ఆదేశాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మ‌రోవైపు కేరళలో ముస్లిం మహిళలకు మసీదులో ప్రవేశం కల్పించాలని హిందూ మహాసభ తరఫున ఒక పిటిషన్ వేశారు. తాజాగా, మసీదుల్లోకి ముస్లిం మహిళల ప్రవేశంపై నిషేధాన్ని చట్టవిరుద్ధం, రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రకటించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఇవాళ ఒక పిటిషన్ దాఖలైంది.


మసీదుల్లోకి ముస్లిం మహిళల ప్రవేశంపై నిషేధం విధించడం వారి మౌలిక అధికారాలను ఉల్లంఘించడమేనని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ ప్రవేశం గురించి కోర్టు విస్పష్టమైన ఆదేశాలను జారీ చేయాలని అప్పీల్ చేశారు. ఆగస్ట్ 2016లో ఇలాంటి పిటిషన్ నే విచారిస్తూ బాంబే హైకోర్ట్ మహిళలకు ముంబైలోని సుప్రసిద్ధ హాజీ అలీ దర్గాలోని మజార్ వరకు వెళ్లడంపై ఉన్న ఆంక్షలను తొలగించాలని ఆదేశాలిచ్చింది. మహిళల ప్రవేశంపై ఆంక్షలు విధించడం రాజ్యాంగం ఇచ్చిన వారి మౌలిక ఆధికారాలను హరించడమేనని హైకోర్ట్ చెప్పింది. హైకోర్ట్ తీర్పును దర్గా ట్రస్ట్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కానీ సుప్రీంకోర్ట్ కూడా హైకోర్ట్ నిర్ణయాన్ని సమర్థించింది. దీని తర్వాత మొదటిసారి మహిళలు ప్రఖ్యాత హాజీ అలీ దర్గాలోని లోపలి ప్రదేశాలలో ప్రవేశించారు. మహిళల పక్షాన ఎన్నో తీర్పులు వచ్చిన తర్వాత ఇప్పుడు ముస్లిం మహిళలను మసీదులో నమాజ్ చేసేందుకు అనుమతించాలనే డిమాండ్ బలం పుంజుకుంటోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: